ప్రధాని, సోనియాలపై పోలీసులకు న్యాయవాదుల ఫిర్యాదు
అనంతపురం: రాష్ట్ర విభజనలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆరుగురు కేంద్ర మంత్రులపైన కూడా విచారణ జరపాలని సీఐ గోరంట్ల మాధవ్కు ఇచ్చిన ఫిర్యాదులో ఆ న్యాయవాదులు కోరారు.
రాష్ట్రాన్ని విభజిస్తూ, రాష్ట్ర ప్రజల మధ్య వారు చిచ్చు పెడుతున్నారని న్యాయవాదులు మల్లికార్జున, నాగన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని, సోనియాతో పాటు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, వీరప్పమొయిలీ, గులాంనబీ ఆజాద్, చిదంబరం, కావూరి సాంబశివరాలు, జైపాల్ రెడ్డిలపై కూడా కేసు నమోదు చేయాలని వారు కోరారు. న్యాయ నిపుణులతో చర్చించి కేసు నమోదు చేస్తామని ఫిర్యాదు స్వీకరించిన సీఐ మాధవ్ వారికి హామీ ఇచ్చారు.