సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: సూళ్లూరుపేటలో ప్రభుత్వాసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని సమాచారమందడంతో కలెక్టర్ శ్రీకాంత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వేసిన ప్రశ్నలకు వైద్యాధికారులు తత్తరపోయారు. ‘ఆస్పత్రి ఇన్‌చార్జి గారూ.. మీరు రోజూ వచ్చిపోతున్నారా..చెన్నైలో ఉంటూ అప్పుడప్పుడు విజిట్‌కు వస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక్కడున్న రిజిస్టర్‌లపైన అవగాహన లేదంటే మీరు సరిగా వ చ్చిపోతున్నట్టు కనిపించలేదు...ఏమండీ డీఎంహెచ్‌ఓ గారూ..ఈమె విధులు నిర్వహించకుండా మీకు రెండున్నర లక్షల రూపాయలు లంచం ఇచ్చింది కదా’ అని కలెక్టర్ శ్రీకాంత్ ప్రశ్నించారు. ఉలిక్కిపడిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ లేదు సార్ అంటూ సమాధానం ఇచ్చారు.
అయితే ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్ ప్రియదర్శిని ఆస్పత్రికి రాకుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేర్నాడు పీహెచ్‌సీ వైద్యాధికారి పద్మావతిపైనా ఫిర్యాదు ఉంది కదా! ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. వీటికి డీఎంహెచ్‌ఓ నీళ్లు నములుతూ సమాధానం ఇచ్చారు. మొదట కలెక్టర్ ఆస్పత్రి ఆవరణలోని ఫ్లూయిడ్ బాటిల్స్, మాత్రలను చూసి స్టాక్ రిజిస్టర్ తెమ్మని ఆదేశించడంతో సిబ్బంది తెల్లముఖాలేశారు. రికార్డులను తనిఖీ చేయగా రెండు బాక్సుల నిండా ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.
ఇలా మిగలబెట్టి మందుల షాపులో అమ్మేస్తున్నారా..అని నిలదీశారు. ఆస్పత్రి నిధుల వినియోగంపైనా ఆరా తీశారు. దుర్వినియోగం చేస్తే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. సుమారు రూ. 96 లక్షలు వెచ్చించి సీమాంక్ సెంటర్‌ను ఆధునాతనంగా నిర్మిస్తే పాత భవనంలో నుంచి ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి లోపు మార్చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసినందుకు ఎవరైనా డబ్బులు అడిగితే తనకు గానీ, ఆర్డీఓకు గానీ సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట ఆర్డీఓ ఎన్.వెంకటరమణ, క్లస్టర్ అధికారి మస్తానమ్మ తదితరులు ఉన్నారు.
రెండున్నర లక్షలు తీసుకున్నారట.!
Published Sat, Jan 11 2014 3:52 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
Advertisement
Advertisement