ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు కుంటలో పడి మృతి చెందారు.
కదిరి (అనంతపురం): ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు కుంటలో పడి మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కదిరి పట్టణంలో ఐదో తరగతి చదువుతున్న కిరణ్‌కుమార్(11), లోకేష్‌నాయక్ (11)లు ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ బుధవారం ఈతకు వెళ్లి కుంటలో పడి మృతి చెందారు. ఆటకు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
దీంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని కుంట వద్ద ఉన్న పిల్లల దుస్తుల ఆధారంగా వారిని గుర్తించారు. బాలురకు ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కుంటలో నుంచి బాలుర మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం కదిరిలోని ఆస్పత్రికి తరలించారు.