నీటికుంటలోంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తెస్తున్న యువకుడు
అనంతపురం , హిందూపురం : ఈత కొడదామని వెళ్లిన ఇద్దరు చిన్నారులను నీటికుంట మింగింది. లోతు అంచనా వేయలేక కుంటలోకి దిగిన పిల్లలు నీటిలో మునిగిపోతూ శ్వాస విడిచారు. తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చారు. వివరాల్లోకెళ్తే.. తూమకుంటలో నివాసముంటున్న గార్మెంట్స్ కార్మికుడు తిప్పరాజు కుమారుడు రాం చేతన్ (6), కూలీ అంజినప్ప కుమారుడు అశోక్ (10)లు శుక్రవారం ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఈతకని బయల్దేరారు. గ్రామ సమీపంలోని ఇసుక, మట్టి కోసం తీసిన గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది. నీరు తక్కువగా ఉంటుంది కదా కాసేపు కుంటల్లో దిగి శరీరాన్ని చల్లబరుచుకుని వద్దామనుకున్నారు. లోతు అంచనా వేయలేక పెద్ద నీటికుంటలోకి పిల్లలిద్దరూ దిగారు. అలా కొంతదూరం ముందుకెళ్లాక నీటమునిగారు. దీన్ని గమనించిన ఓ వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని కొందరు యువకులు అక్కడకు చేరుకున్నారు. కుంటలోకి దిగి రాం చేతన్, అశోక్‌లను బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ పిల్లలు నీటిలో ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఇంట్లో చెప్పకుండా వచ్చి ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతిరా అంటూ రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హిందూపురం రూరల్ ఎస్‌ఐ వినాయక్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment