పర్యాటకుల మదిలో చిరస్థాయిలో నిలిచేలా.. | Two Days Celebrations At Belum Caves In Kurnool District | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘బెలుం’ ఉత్సవాలు

Published Sat, Feb 8 2020 9:28 AM | Last Updated on Sat, Feb 8 2020 10:36 AM

Two Days Celebrations At Belum Caves In Kurnool District - Sakshi

కర్నూలు/కొలిమిగుండ్ల: భారతీయ సంస్కృతిలో గుహలు దేవుళ్లకు నివాసమనే నమ్మకం ఉండటంతో అవి పవిత్ర స్థలాలుగా విరాజిల్లుతున్నాయి. సాధారణంగా గుహలు కొండచరియల్లో, అడువుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాని గుహల ప్రవేశ ద్వారం చేరే వరకు తెలియనంత సమతల ప్రదేశంగా, వ్యవసాయం చేసుకునే సాగు భూమి కింద సమాంతరంగా గుహలు ఏర్పడి ఉండటం ఓ అద్భుతం. అలాంటి అద్భుతాన్ని కనులారా వీక్షించాలంటే బెలుం గుహలను సందర్శించాల్సిందే. (ఇక్కడ చదవండి: భళా బెలుం

ప్రపంచంలోనే రెండొవదిగా.. భారత్‌లోనే పొడవైన అంతర్‌ భూభాగ గుహలుగా ఖ్యాతి పొందిన బెలుం ఆవరణలో భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పర్యాటకుల మదిలో చిరస్థాయిలో నిలిచేలా ‘రారండో వేడుక చూద్దామంటూ’ ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో బెలుం గుహల విశిష్టతలు, వేడుక ఏర్పాట్లపై ప్రత్యేక కథనం.


సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిలోమీటరు పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరచి నడకదారిని ఏర్పరిచారు, 150 విద్యుద్దీపాలతో గుహలో వెలుగులు ఏర్పాటు చేశారు. గుహలలోపలికి గాలిని పంపే బ్లోయర్లు ఏర్పాటు చేయడం విశేషం. 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు ఉన్న ఈ సొరంగాలు కొన్ని చోట్ల ఇరుకు, కొన్ని చోట్ల విశాలమైన గదులుగా ఉండటం, కొన్ని చోట్ల స్టాలక్‌ టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్పటికాకృతులు ఏర్పడి ఉండటం విశేషం. ఈ కృత్రిమ శిలల ఆకృతిలను బట్టి కొన్ని ప్రదేశాలకు వేయిపడగలు, కోటిలింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం వంటి పేర్లు పెట్టారు. ఇవిగాక ధ్యాన మందిరం, మండలం కూడా ఉన్నాయి. ఈ గుహల చివరి వరకు పోతే పాతాళ గంగ అనే నీటి మడుగు, అక్కడే రాతిలో మలిచిన శివలింగం కూడ కనిపిస్తోంది. విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగాలు సోయగాలను తిలకిస్తూ.. పయనిస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. గుహలలోపల ఏడాది పొడవున 33 డిగ్రీల స్థిరమైన ఉష్ణోగ్రత ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది.

వెలుగులోకి వచ్చింది ఇలా... 
1884లో హెచ్‌బీ పూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా గుహలను గుర్తించారు. 1982, 1984 శీతాకాలాల్లో హెచ్‌డీ గేబర్‌ అనే జర్మన్‌ దేశస్తుడు తన సహచరులతో కలసి 3,225 మీటర్లు శోధించి ఒక పటాన్ని తయారు చేశారు. వీరికి స్థానికులు రిటైర్డ్‌ ఎస్పీ చలపతిరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి సహకారం అందించారు. 1988లో ఆంధ్రప్రదేశ్‌ పురాతత్వశాఖ వీటిని రక్షణ స్థలంగా ప్రకటించి కాపలాదారులను నియమించింది. 1999లో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ బెలుం గుహలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ అధీనంలోకి తీసుకొని  అభివృద్ధి చేసింది. పురాతన కాలంలో గుహలను ప్రాచీన మానవులు నివాసంగా మార్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. క్రీ.పూ. 450 సంవత్సరాల నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, ఒక రాతి కత్తి లభ్యం కావడం విశేషం. ఒకప్పుడు బిలంగా పిలువబడుతుండగా క్రమేణా బెలుం గుహలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి నెల 20 నుంచి 50 మంది వరకు విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఏటా విదేశీయులతో కలిపి 2 లక్షల మంది పర్యాటకులు బెలుం గుహల అద్భుతాలను చూసి మైమరిచిపోతారు.

ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు
ప్రపంచంలోనే బెలుం గుహలకు ప్రత్యేక స్థానం ఉందని జాయింట్‌ కలెక్టర్‌–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ అన్నారు.ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు కర్నూలు జిల్లాలో ఉండడం అదృష్టమన్నారు. శని, ఆదివారాల్లో నిర్వహించే బెలుం ఉత్సవాలను సందర్భంగా శుక్రవారం కొండారెడ్డి బురుజు నుంచి కిడ్స్‌ వరల్డ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి బురుజు సమీపంలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలోనే భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే బెలూం ఉత్సవాల్లో పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పర్యాటక రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన మనదేశంలో బెలూం గుహలు అద్భుతమైనవన్నారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ ఎంకేవీ శ్రీనివాసులు, పౌరసంబంధాల శాఖ డీడీ పి.తిమ్మప్ప బెలుం గుహల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో నగరంలోని  పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్వ యం సహాయక సంఘాల మహిళలు,  పాల్గొన్నారు.

సర్వం సిద్ధం
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెలుం ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. 8, 9వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేడుకలు కనువిందుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, జేసీ రవిపట్టన్‌శెట్టి, జేసీ–2 ఖాజామోహిద్దీన్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి్ద సంస్థ డీవీఎం ఈశ్వరయ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే పర్యాటకులను అలరించేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సందర్శకులకు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 రకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖల ప్రగతిని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పశుసంవర్ధకశాఖ అధికారులు ఒంగోలు కోడెలు, మేలు జాతి విత్తనపు పొట్టేళ్లు, అరుదైన పుష్పాలతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, డీఆర్‌డీఏ విద్యశాఖ తదితర శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తోంది. రాయలసీమ రుచుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఫుడ్‌ కోర్టు కూడా ఏర్పాటు చేశారు.  గ్రామీణ క్రీడల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, కర్రసాము, గుండు ఎత్తడం తదితర పోటీలు నిర్వహించనున్నారు.

విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఉత్సవాలకు హజరయ్యే ప్రజలు పర్యాటకులను ఉర్రూతలూగించేందుకు పలువురు సెలబ్రిటీలు రానున్నారు. జిల్లాకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గొరువయ్యల నృత్యాలు, కోలాటం, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, బీరప్పడోళ్లు తదితర వాటిని ప్రదర్శిస్తారు. సాయంత్రం 4.30 నుంచి సెలబ్రిటీల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.  సింగర్‌ సింహ, అనుదీప్, గీతాభగత్‌ తదితరులు తమ పాటలతో అలరించనున్నారు. 

క్లాసికల్‌ డాన్స్‌లు, వెస్టర్న్‌ డాన్స్‌లు, లేజర్‌ షోలు తదితర ఎన్నో కార్యక్రమాలు అలరించనున్నాయి. తాగునీరు, టాయ్‌లెట్లు తదితర సౌకర్యాలు సిద్ధం చేశారు. పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, పది మంది ఎస్‌ఐలతో కలిపి మొత్తం 150 మందికి పైగానే పోలీస్‌ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. గుహలను తిలకించేందుకు రెండు రోజుల పాటు విద్యార్థులకు సాధారణ రోజుల్లో వసూలు చేసే టికెట్‌ ధరలో రాయితీ కల్పించనున్నారు.

 

ఇలా చేరుకోవాలి..
కొలిమిగుండ్ల మండలం పరిధిలోని బెలుం గుహలు ఇటు బనగానపల్లె నుంచి 30 కి.మీ., అటు తాడిపత్రి నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. కర్నూలు నుంచి చేరుకోవాలంటే  110 కి.మీ., అనంతపురం నుంచి 80 కి.మీ., చెన్నై నుంచి 420 కి.మీ., బెంగళూరు నుంచి 280 కి.మీ., తిరుపతి నుంచి 275 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. కర్నూలు–తాడిపత్రి, విజయవాడ– బెంగళూరు, నంద్యాల,  అవుకు( బనగానపల్లి మీదుగా) చేరుకోవచ్చు. కొలిమిగుండ్ల గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement