
పుష్కర విషాదం
మ్యాజిక్ వ్యాన్ బోల్తా : ఇద్దరి మృతి
గండేపల్లి : మల్లేపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మ్యాజిక్ వాహనంలో రాజమండ్రి నుంచి తిరుగు ప్రయాణంలో మల్లే వద్దకు వచ్చేసరికి తూమును వేగంగా ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన మీసాల సత్యం (60) కేబిన్‌లో ఇరుక్కుని మృతి చెందాడు. వెనుక కూర్చున్న విజయనగరం జిల్లా పినపరిణికి చెందిన సుంకి సోములు (35) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న కంది కృష్ణమోహన్, ఆల్తి శివ, లంక అప్పలనాయుడు, ఆల్తీ నవీన్, బొత్స వెంకటపద్మావతి, గేది సత్యనారాయణ, మజ్జి సంతోష్, మీసాల సరస్వతి, ఆల్తీ రాము గాయపడ్డారు. ఆటోలో చిక్కుకున్న వీరిని స్థానికులు రక్షించారు. వీరిలో అప్పలనాయుడు, మరో మహిళ పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. క్షతగ్రాతులను హైవే అంబులెన్స్‌లో రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలిసింది. డ్రైవర్ అక్కడ నుంచి పరారైనట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని ఎస్సై ఎన్.రజనీకుమార్ సందర్శించికేబిన్‌లోని సత్యం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దంపతులను ఢీకొన్న వ్యాన్ : భర్త మృతి
పి.గన్నవరం : పుష్కర స్నానం చేసి మోటార్ సైకిల్‌పై తిరిగి వస్తున్న దంపతులను వ్యాన్ ఢీ కొట్టడంతో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్య గాయాలపాలైంది. ఈ సంఘటన మండలంలోని ఊడిమూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై వీరబాబు కథనం ప్రకారం యర్రంశెట్టి వారి పాలెం గ్రామానికి చెందిన కొండేటి నాగేశ్వరరావు (55), అతడి భార్య సత్యవతి ఉదయం మోటారు సైకిల్‌పై రావులపాలెం పుష్కర స్నానానికి వెళ్లారు. అక్కడ పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తుండగా ఊడిమూడి వద్ద రావులపాలెం వైపు వెళ్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. నాగేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య సత్యవతికి తీవ్ర గాయాలు కావడంతో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగేశ్వరరావు మృతదేహానికి అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతు డి కుమారుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు. నాగేశ్వరరావు మృతితో యర్రంశెట్టివారి పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పుష్కర స్నానానికి వెళుతూ మహిళ మృతి
పాశర్లపూడి(మామిడికుదురు) : పుష్కర స్నానానికి సోంపల్లి వెళ్తున్న సలాది వెంకటలక్ష్మి(45)ని వెనుక నుంచి వచ్చిన అమలాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందింది. స్థానిక గుబ్బలవారి మెరకలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. కరప మండలం వేములవాడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి బెంగుళూరులో ఉంటోంది. అక్కడి నుంచి స్వగ్రామం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అమలాపురంలో బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులంతా కలిసి రెండు మోటార్ బైక్‌లపై సోంపల్లి పుష్కర స్నానానికి బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అల్లుడు రావుల దుర్గాప్రసాద్ డ్రైవ్ చేస్తున్న బైక్‌పై వెనుక కూర్చున్న వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఆమెను అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లుడు దుర్గాప్రసాద్‌కు కూడా గాయాలయ్యాయి. దీనిపై నగరం ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుష్కరస్నానానికి వెళ్లి వస్తుండగా ..
గోవలంక (తాళ్లరేవు) : ఏటిగట్టు రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవలంక గ్రామానికి చెందిన రేవు లక్ష్మి (55) మృతి చెందింది. గోవలంక గ్రామానికి చెందిన లక్ష్మి గోదావరిలో పుష్కర స్నానం చేసి తిరిగి గ్రామంలోకి వస్తుండగా కోటిపల్లి వైపు వెళుతున్న పల్లిపాలెం గ్రామానికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెం దింది. కేసుదర్యాప్తు చేస్తున్నట్టు కోరంగి ఏఎస్సై ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
కుప్పకూలిన మహిళ : రక్షించిన గ జ ఈతగాళ్లు
కోటిలింగాలఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానం చేస్తూ ఒక భక్తురాలు గోదావరిలో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన గజ ఈతగాళ్లు ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన బాగ్యలక్ష్మి శుక్రవారం బంధువులతో కలిసి కోటిలింగాల రేవుకు పుష్కరస్నానం చేయడానికి వచ్చింది. నదిలోకి దిగి స్నానం చేస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గజ ఈతగాళ్లు రక్షించి, ప్రభుత్వ వైద్య శిబిరం దగ్గరకు చేర్చగా వైద్యులు సేవలందించారు. అనంతరం 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు సుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల అస్వస్థతకు గురైనట్టు వెద్యులు తెలిపారు.