కేసవదాసుపురంలో పోలీస్ పికెట్
సాక్షి, పొందూరు: మండలంలోని కేసవదాసుపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా యువకుల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణగలేదు. సోమవారం ఉదయం ఇరు వర్గాలకు చెందిన పలువురు మరోసారి కొట్లాటకు దిగారు. గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు టిఫిన్ చేసి వచ్చే కాసింత సమయంలోనే పలువురు పరస్పర దాడులకు దిగారు. ఆది, సోమవారాలు జరిగిన దాడుల్లో లింగాల శకుంతల, యజ్జల అప్పమ్మ, లింగాల తోటరాజు, గాడు ఎర్రప్పడుకు గాయాలయ్యాయి. లింగాల శకుంతల, యజ్జల అప్పమ్మకు చేయికి గాయాలు కాగా, ఛాతి ఎడమవైపు ఎముక బీటలు వారినట్లు వైద్యులు చెప్పినట్లు లింగాల తోటరాజు తెలిపారు.
బీసీ కులానికి చెందిన గాడు ఎర్రప్పడు కాలికి, మెడకు గాయాలయ్యాయి. చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అంబేడ్కర్ విగ్రహం వద్దే తమపై బీసీలు దాడులు చేశారని, విగ్రహాన్ని పగలగొట్టేందుకు ప్యత్నించారని దళితులు ఆరోపించారు. నాగవరపు రమణ అనే వ్యక్తి తనకు లైసెన్స్ ఉందని, లారీతో మిమ్మల్ని గుద్దించేస్తానని బెదిరించనట్లు దళిత యువకుడు జె.ప్రదీప్ తెలిపారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మొదటి దళిత సామాజిక వర్గానికి చెందిన యువకులే బీసీ యువకులను తిట్టారని కొంత మంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
విఫలమైన చర్యలు...
గ్రామంలో కొనసాగుతున్న పికెటింగ్‌ను జెఆర్‌పుర సీఐ వై.మల్లేశ్వరరావు సోమవారం పరిశీలించారు. క్రికెట్ ఆడుకుంటున్న యువకుల మధ్య గొడవ జరిగితే పెద్దలు పరిష్కరించాల్సింది పోయి దాడులకు పాల్పడడటం సరికాదన్నారు. గ్రామంలో ఇరు కులాలకు చెందిన పెద్దలతో చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమైయ్యాయి. సమస్య కొలిక్కి రాకపోవడంతో మొదటిగా దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహ్మద్ యాసిన్ తెలిపారు. బీసీ వర్గానికి చెందిన వారు కూడా 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment