
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో గురువారం ఇద్దరు గాయపడ్డారు. రాజమహేంద్రవరంలో పవన్ బస చేసిన రివర్ బే హోటల్ దగ్గర పవన్ అభిమానులు కోలాహలం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఇక్కడి నుంచి బయలుదేరిన ఆయనను చూసేందుకు అభిమానులు పోటీపడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పవన్ కల్యాణ్ కారులో నుంచి అభివాదం చేసే సమయంలో ఓ అభిమాని అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు గాయమైంది.
మరోవైపు రోడ్డు కం రైలు వంతనపై పవన్ కాన్వాయ్‌లోని వాహనం తగిలి ఓ కానిస్టేబుల్ కాలికి గాయమైంది. బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందులు పడ్డామంటూ రాజమహేంద్రవరం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశంకానున్నారు.