రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కోటబొమ్మాళి : జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులు, క్షతగాత్రుడు పశ్చిమగోదావరి జిల్లావాసులు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం గురించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపారానికి చెందిన తిరుమల నాగస్వామి (27), నాతరెడ్డి లక్ష్మినారాయణ అలియాస్ నాని(28), నర్సాపురానికి చెందిన శివభవానీ ఆ జిల్లాలో ఆక్వా పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి చేప పిల్లలు తెచ్చేందుకు వారు మంగళవారం రాత్రి కారులో బయలుదేరారు.
బుధవారం ఉదయం 6 గంటల సమయంలో కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోయింది. దీంతో కారు నడుపుతున్న తిరుమల నాగస్వామి, ముందు సీట్లో కూర్చున్న నాతరెడ్డి లక్ష్మినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న శివభవానీ కాళ్లు విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చి కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోవడంతో బయటకు తీయలేకపోయారు.
దీంతో స్థానిక పోలీసులు క్రేన్‌ను తెప్పించి లారీ నుంచి కారును వేరు చేసి మృతదేహాలను వెలికి తీశారు. గాయాల పాలైన శివభవానీని 108 అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీని రోడ్డు పక్కన ఆపి సిబ్బంది టీ తాగేందుకు వెళ్లారు. వారు వచ్చేలోగా జరిగిన ప్రమాదంలో లారీ వెనుక టైరు దెబ్బతింది. టెక్కలి సీఐ పి.శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుల బంధువులకు సమాచారమిచ్చిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.నారాయణస్వామి తెలిపారు.