ఇద్దరు మంత్రులు
సాక్షి, ఏలూరు : నూతన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది. చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును చంద్రబాబు తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన సభాస్థలి వేదికపై వీరిద్దరూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా వీరి ద్దరూ మంత్రి పదవులను చేపట్టారు.
అనూహ్య పరిణామాలు
సుజాత, మాణిక్యాలరావు విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీటు సంపాదించడం దగ్గర నుంచి కేబినెట్ పదవులు దక్కించు కోవడం వరకూ అనూహ్య పరిణామాలు చోటు చేసు కున్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో తాడేపల్లిగూడెం స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. అప్పుడే మాణిక్యాలరావు పేరు తెరపైకి వచ్చింది. సంఘ్ పరివార్ ప్రోద్బలంతో ఆయన్ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఒకానొక సమయంలో జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు బీజేపీ గట్టి అభ్యర్థులను పోటీలో నిలపలేదంటూ వివాదం లేవనెత్తారు. ఆ సమయంలో మాణిక్యాలరావు టికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత విశ్వప్రయత్నం చేయడంతో ఆయన సీటు పదిలం చేసుకున్నారు. నరసాపురం ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీకి కేటాయించడం మాణిక్యాలరావుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు వెన్నుదన్నుగా నిలిచారు. భీమవరంలో మోడీ సభ, పవన్‌కల్యాణ్ ప్రచారం మాణిక్యాలరావుకు కలిసివచ్చాయి. బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ, సంఘ్ పరివార్ ఒక్కటై మాణిక్యాలరావును గెలిపించాయి. మంత్రి వర్గంలో బీజేపీకి చోటు కల్పించడం, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మాణిక్యాలరావుకు మంత్రి పదవి దక్కింది.
మహిళకు అందలం
చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత కూడా అనూహ్యంగానే పదవిని దక్కించుకున్నారు. గతంలో ఆచంట ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఈ ఎన్నికల సమయంలో చివరి నిమిషం వరకు ఆమెకు టికెట్ ఖరారు చేయలేదు. ముందు గోపాలపురం లేదా కొవ్వూరు నుంచి ఆమెను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. చివరకు చింతలపూడి టికెట్‌ను ఆమె దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆమె పార్టీలో కీలకంగా మారారు. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును బలపరిచే అవకాశాన్ని దక్కించుకున్నారు. గవర్నర్‌ను కలిసిన బృం దంలోనూ ఆమె ఉన్నారు. జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైన మహిళా ఎమ్మెల్యే కావడం ఆమెకు అనుకూలంగా మారింది.