Paidikondala Manikya Rao
-
మృతుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం
- కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి - దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల డిమాండ్ తాడేపల్లిగూడెం : సహజ వాయువు పైపులైన్ పేలుడు ఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలో పేలుడు ప్రాంతాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన చూశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రదాన్‌ను మంత్రి కోరారు . మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారంతోపాటు ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చమురు, సహజవాయువులను వెలికితీసే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతూ స్థానిక ప్రజలు తీవ్ర కష్ట నష్టాలకు గురవుతున్నారని, అయితే ప్రయోజనాలు మాత్రం ఇతర రాష్ట్రాలకు చేకూరుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒఎన్జీసీ కేటాయించే కేంద్రీయ అభివృద్ధి నిధులను కచ్చితంగా స్థానికంగానే ఖర్చు చేయాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో 50 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రదాన్ సానుకూలంగా స్పందించారన్నారు. నగరం గ్రామ పరిధిలో మూడు వేల మందికి ఉదయం, రాత్రి దేవాదాయశాఖ తరపున మంత్రి మాణిక్యాలరావు భోజనాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు మంత్రి మాణిక్యాలరావును అభినందించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తదితరులు మంత్రితోపాటు ఉన్నారు. -
పట్టు కోసం బీజేపీ ప్రయత్నం
భీమవరం : జిల్లాలో తొలిసారి ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే సీటు గెలుచుకుని ఉనికి చాటుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేదిశగా పావులు కదుపుతోంది. గ్రామస్థాయిలోనూ సొంత కాళ్లపై నిలబడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో జిల్లా నుంచి ఒక మంత్రి పదవిని దక్కించుకోవడంతో పార్టీ శ్రేణులు జోష్‌మీద ఉన్నాయి. రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సహకారంతో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వం ఆలోచన చేస్తోంది. త్వరలో జరగనున్న మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో మిత్రపక్షం కోటా లో పదవులు దక్కించుకోవాలని, తద్వారా పట్టణాల్లోనూ పాగా వేయూలనే వ్యూహంతో నాయకులు ముందుకు కదులుతున్నారు. భీమవరం, తణుకు మునిసిపాలిటీల్లో కీలకమైన పదవులపై కన్నేశారు. మండల పరిషత్‌ల్లోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీటితోపాటు మార్కెట్ కమిటీలు, దేవస్థానాల పాలకవర్గాలు, ఇతర నామినేటెడ్ పదవులను దక్కించుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యూరు. తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం మార్కెట్ కమిటీల్లో ఒక చైర్మన్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో నామినేటెడ్ పదవులపైనా బీజేపీ నేతలు కన్నేశారు. పదవులు దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఒత్తిడి చేయడంతోపాటు కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ఇతర పెద్దల సహకారంతో పావులు కదుపుతున్నారు. బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మేజర్ ప్రాజెక్ట్‌లకు నిధులు తెచ్చే అవకాశం ఉంటుందనే విషయూన్ని తెరపైకి తెస్తున్నారు. నేడు భీమవరంలో సమావేశం జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు అప్పగించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భీమవరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహరచన చేయనున్నట్టు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. -
ఫొటోగ్రాఫర్ నుంచి మంత్రిగా..
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :ఫొటోగ్రాఫర్‌గా జీవితం ప్రారంభించిన పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా.. రాష్ట్ర మంత్రిగా ఎది గారు. సామాన్య వ్యక్తిగా.. పార్టీకి విధేయుడిగా మెలిగిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మాణిక్యాలరావు 7వ తరగతి చదువుతున్న రోజుల్లోనే సంఘ్ పరివార్‌లో చేరారు. 40 ఏళ్లకు పైగా పరివార్ కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, బీజేపీలోనూ సేవలందించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ‘ఓ సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడమా.. గెలుస్తాడా’ అని రాజకీయ వర్గాలు పెదవి విరిచారుు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 14 వేల పైచిలుకు మెజారిటీతో మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. జిల్లా నుంచి శాసనసభకు ఎన్నికైన తొలి కమలనాథుడిగా రికార్డు సృష్టించారు. ఫలితాలు వెలువడిన నాటినుంచి ఆయనకు మంత్రి పదవి దక్కతుందనే ప్రచారం సాగింది. బీజేపీ తరఫున సీమాంధ్ర లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో మాణిక్యాలరావు సీనియర్ కావడం, సీమాంధ్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఉన్న సోము వీర్రాజు మాణిక్యాలరావుకు సన్నిహితులు కావడం, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండటం తదితర పరిస్థితుల నేపథ్యంలో మాణిక్యాలరావుకు మంత్రి పదవి దక్కింది. సామాన్యుడు ఇంత ఘనత దక్కించుకోవడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఈలి.. ఇప్పుడు మాణిక్యం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత స్థానికుడికి మంత్రి పదవి దక్కడం ఇది రెండోసారి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆచంట రుక్మిణమ్మ, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన యర్రా నారాయణస్వామి, చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు వంటివారు మంత్రులుగా పనిచేసినా వారు ఈ ని యోజకవర్గానికి స్థానికేతరులే. మంత్రులుగా పనిచేసిన స్థానికుల్లో ఇప్పటివరకూ ఏకైక వ్యక్తి గా ఈలి ఆంజనేయులు మాత్రమే ఉన్నారు. ఆయన తర్వాత అలాంటి అవకాశం మాణిక్యాలరావుకు వచ్చింది. రాజకీయ నేపథ్యం విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. 7వ తరగతి చదువుతున్న రోజుల్లో జై ఆంధ్రా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాత పోరాటం చేశారు. భారతీయ జనతా పార్టీ అవిర్భావం నుంచి ఆ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా, జిల్లా శాఖ ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా శాఖ అధ్యక్షునిగా పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, సీమాంధ్ర ఉద్యమ కమిటీ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. -
ఇద్దరు మంత్రులు
సాక్షి, ఏలూరు : నూతన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది. చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును చంద్రబాబు తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన సభాస్థలి వేదికపై వీరిద్దరూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా వీరి ద్దరూ మంత్రి పదవులను చేపట్టారు. అనూహ్య పరిణామాలు సుజాత, మాణిక్యాలరావు విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీటు సంపాదించడం దగ్గర నుంచి కేబినెట్ పదవులు దక్కించు కోవడం వరకూ అనూహ్య పరిణామాలు చోటు చేసు కున్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో తాడేపల్లిగూడెం స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. అప్పుడే మాణిక్యాలరావు పేరు తెరపైకి వచ్చింది. సంఘ్ పరివార్ ప్రోద్బలంతో ఆయన్ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఒకానొక సమయంలో జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు బీజేపీ గట్టి అభ్యర్థులను పోటీలో నిలపలేదంటూ వివాదం లేవనెత్తారు. ఆ సమయంలో మాణిక్యాలరావు టికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత విశ్వప్రయత్నం చేయడంతో ఆయన సీటు పదిలం చేసుకున్నారు. నరసాపురం ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీకి కేటాయించడం మాణిక్యాలరావుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు వెన్నుదన్నుగా నిలిచారు. భీమవరంలో మోడీ సభ, పవన్‌కల్యాణ్ ప్రచారం మాణిక్యాలరావుకు కలిసివచ్చాయి. బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ, సంఘ్ పరివార్ ఒక్కటై మాణిక్యాలరావును గెలిపించాయి. మంత్రి వర్గంలో బీజేపీకి చోటు కల్పించడం, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మాణిక్యాలరావుకు మంత్రి పదవి దక్కింది. మహిళకు అందలం చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత కూడా అనూహ్యంగానే పదవిని దక్కించుకున్నారు. గతంలో ఆచంట ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఈ ఎన్నికల సమయంలో చివరి నిమిషం వరకు ఆమెకు టికెట్ ఖరారు చేయలేదు. ముందు గోపాలపురం లేదా కొవ్వూరు నుంచి ఆమెను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. చివరకు చింతలపూడి టికెట్‌ను ఆమె దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆమె పార్టీలో కీలకంగా మారారు. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును బలపరిచే అవకాశాన్ని దక్కించుకున్నారు. గవర్నర్‌ను కలిసిన బృం దంలోనూ ఆమె ఉన్నారు. జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైన మహిళా ఎమ్మెల్యే కావడం ఆమెకు అనుకూలంగా మారింది.