పట్టు కోసం బీజేపీ ప్రయత్నం
భీమవరం : జిల్లాలో తొలిసారి ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే సీటు గెలుచుకుని ఉనికి చాటుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేదిశగా పావులు కదుపుతోంది. గ్రామస్థాయిలోనూ సొంత కాళ్లపై నిలబడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో జిల్లా నుంచి ఒక మంత్రి పదవిని దక్కించుకోవడంతో పార్టీ శ్రేణులు జోష్‌మీద ఉన్నాయి. రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సహకారంతో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వం ఆలోచన చేస్తోంది. త్వరలో జరగనున్న మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో మిత్రపక్షం కోటా లో పదవులు దక్కించుకోవాలని, తద్వారా పట్టణాల్లోనూ పాగా వేయూలనే వ్యూహంతో నాయకులు ముందుకు కదులుతున్నారు.
భీమవరం, తణుకు మునిసిపాలిటీల్లో కీలకమైన పదవులపై కన్నేశారు. మండల పరిషత్‌ల్లోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీటితోపాటు మార్కెట్ కమిటీలు, దేవస్థానాల పాలకవర్గాలు, ఇతర నామినేటెడ్ పదవులను దక్కించుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యూరు. తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం మార్కెట్ కమిటీల్లో ఒక చైర్మన్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో నామినేటెడ్ పదవులపైనా బీజేపీ నేతలు కన్నేశారు. పదవులు దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఒత్తిడి చేయడంతోపాటు కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ఇతర పెద్దల సహకారంతో పావులు కదుపుతున్నారు. బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మేజర్ ప్రాజెక్ట్‌లకు నిధులు తెచ్చే అవకాశం ఉంటుందనే విషయూన్ని తెరపైకి తెస్తున్నారు.
నేడు భీమవరంలో సమావేశం
జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు అప్పగించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భీమవరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహరచన చేయనున్నట్టు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.