చెన్నై, సాక్షి ప్రతినిధి: కోయంబత్తూరు, తూత్తుకూడి కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు, 4 మున్సిపాలిటీలకు, 6 పంచాయతీ అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 8 కార్పొరేషన్ వార్డు కౌన్సిలర్ స్థానాలకు, 23 మునిసిపాలిటీ కౌన్సిలర్ స్థానాలకు, 39 పంచాయతీ సభ్యులు తదితర స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 530 స్థానాలకు గానూ 1486 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అన్ని స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీ పడుతుండగా, బీజేపీ, వామపక్షాలు కొన్నిచోట్ల రంగంలో ఉన్నాయి. డీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, పీఎంకే తదితర పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించాయి. ఈనెల 16వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగిసిపోగా ప్రచారం నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు.
పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో బూత్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం పూర్తి చేసింది. ఈసీ నుంచి బూత్ స్లిప్పులు పొందినవారు ఎటువంటి గుర్తింపు కార్డు అవసరం లేకుండానే ఓటు వేయవచ్చు. ఈసీ స్లిప్పులు లేనివారు ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్సు తదితర 14 గుర్తింపు కార్డులను చూపి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. నోటా లేదు: ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టంలేని వారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) బటన్‌తో నోటా హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. పోలింగ్‌బూత్‌లతో 49 ఓ ఫారంను పొంది నోటా హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ఎన్నికల్లో మొత్తం 5 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ 35 వ వార్డు పరిధిలోని 12 పోలింగ్ కేంద్రాలు, 48 బూత్‌లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.
బీజేపీ అభ్యర్థిపై దాడి
కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నందకుమార్‌పై బుధవారం దాడి చేశారు. 65వ వార్డు పరిధిలో అన్నాడీఎంకే నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందడంతో అభ్యర్థి నందకుమార్‌తోపాటూ బీజేపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. నగదు పంపిణీ చేస్తున్నవారిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ సమాచారం అందుకున్న కొందరు దుండగులు నందకుమార్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఆయన ప్రయాణిస్తున్న కారును పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈమేరకు అభ్యర్థి నందకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేడే పోలింగ్
Published Wed, Sep 17 2014 11:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement