కమల దళంలో ‘కోడి’ చిచ్చు
- కోడి పందాల కోసం కోర్టుకెళ్లిన రఘురామకృష్ణంరాజు
- తాను వ్యతిరేకమంటున్న ఎంపీ గంగరాజు
- ఇద్దరు నేతల తీరుపై బీజేపీ శ్రేణుల్లో అలజడి
భీమవరం : బీజేపీలో కోడి పందాల చిచ్చు రాజుకుంది. ఇద్దరు ముఖ్య నేతల తీరు పార్టీ శ్రేణుల్లో అలజడికి కారణమైంది. సంక్రాంతి రోజుల్లో కోడి పందాల సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నేత, జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అదే పార్టీకి చెందిన మరో పారిశ్రామికవేత్త, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాత్రం కోడి పందాలకు తాను వ్యతిరేకమని చెబుతున్నారు. పందాల వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోయాయని, యువతకు వ్యసనంగా మారుతోందని గంగరాజు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని శనివారం ఆయన విలేకరుల వద్ద వెల్లడించారు. కోడి పందాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని, సంప్రదాయ పందాలు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఒకే పార్టీకి చెందిన, బంధువులైన ఇద్దరు నాయకులు ఇలా పరస్పర విరుద్ధంగా ఉండటం జిల్లాలోని బీజేపీ శ్రేణులతోపాటు పలువురిని అయోమయానికి గురి చేస్తోంది.
అధికారం ఉందని ఏమైనా చేయొచ్చనే దృక్పథం తప్పు
‘మా పార్టీ అధికారంలోకి వచ్చింది కదాని ఏమైనా చేయ్యొచ్చనే దృక్పథంతో ముందుకెళ్లడం చాలా తప్పు. కోడి పందాలు నిర్వహించి తీరుతామని కొందరు ప్రజాప్రతినిధులు సవాళ్లు చేయటం మంచి పరిణామం కాదు. ఏలూరులో జెడ్పీ కార్యాలయం వద్ద ధర్నాలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించాం. కోడి పందాల వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యువత చెడు వ్యవసనాలకు లోనవుతోంది. దీనికి ముమ్మాటికీ నేను వ్యతిరేకిని. కోడి పందాల ముసుగులో పేకాట, గుండాట, ఇతర జూదం విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. వీటిని గట్టిగా నియంత్రించవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. కోడి పందాల స్థానంలో క్రీడలను ప్రోత్సహించాలి. నేను మొదటి నుంచీ కోడి పందాలను వ్యతిరేకిస్తూ వస్తున్నా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవలసిన అవసరం ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా అన్నిరకాలా నష్టపోయేది పందాల నిర్వాహకులే. స్టే వచ్చినంత మాత్రాన కత్తులు కట్టి పందాలు వెయ్యలేరు. జూదం నిర్వహించలేరు. అందుచేత వీటికి దూరంగా ఉండడమే మంచిది’ అని ఎంపీ గంగరాజు వ్యాఖ్యానించారు.తాను కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశానికి వెళుతుండగా అక్కడ ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు తనను నిలిపివేసి ధర్నాలో కూర్చోబెట్టారేగానీ తాను కోడి పందాలకు అనుకూలం కాదని గంగరాజు ఇటు మీడియాతోపాటు అటు ఆ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు.
ఎస్పీ అభినందనీయుడు
జిల్లాల శాంతి భద్రతల పర్యవేక్షణ, కోడి పందాలు, ఇతర జూదాలను నియంత్రించడంలో సమర్థవంతంగా వ్యవహరిస్తున్న ఎస్పీ రఘురామ్‌రెడ్డి నిజాయితీ గల అధికారని ఎంపీ గంగరాజు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో కోడి పందాల సందర్భంగా కేసులు నమోదు చేయడంపై రాద్ధాంతానికి దిగడం ప్రజా ప్రతినిధులకు తగదన్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తేనే మిగిలిన వారు పందాలు వేసేందుకు భయపడతారని, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్న ఎస్పీని అభినందించవలసిందేనని గంగరాజు వ్యాఖ్యానించారు.
పందాలు నిర్వహించి తీరుతాం
‘కొన్నేళ్లుగా సంక్రాంతికి సంప్రదాయ బద్ధంగా వస్తున్న కోడి పందాలను ఈ ఏడాది కూడా నిర్వహిస్తాం. అవసరమైతే కత్తులు లేకుండా, ఇతర జూదాలు నిర్వహించకుండా ఒక్క కాటా కోడి పందాలను మాత్రమే వేయిస్తాం. హైకోర్టు ఆదేశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. రెండు రోజుల్లో అది హియరింగ్‌కు వస్తుంది. సంప్రదాయాలకు సుప్రీం కోర్టు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. గోదావరి జిల్లాల్లో కోడి పందాలు లేనిదే సంక్రాంతి పండగ లేదు. ఈ ప్రాంత ప్రజల పౌరుషానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా కోడి పందాలు నిలుస్తున్నాయి. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించాం’ అని కనుమూరి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.