ఫొటోగ్రాఫర్ నుంచి మంత్రిగా..
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :ఫొటోగ్రాఫర్‌గా జీవితం ప్రారంభించిన పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా.. రాష్ట్ర మంత్రిగా ఎది గారు. సామాన్య వ్యక్తిగా.. పార్టీకి విధేయుడిగా మెలిగిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మాణిక్యాలరావు 7వ తరగతి చదువుతున్న రోజుల్లోనే సంఘ్ పరివార్‌లో చేరారు. 40 ఏళ్లకు పైగా పరివార్ కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, బీజేపీలోనూ సేవలందించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ‘ఓ సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడమా.. గెలుస్తాడా’ అని రాజకీయ వర్గాలు పెదవి విరిచారుు.
అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 14 వేల పైచిలుకు మెజారిటీతో మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. జిల్లా నుంచి శాసనసభకు ఎన్నికైన తొలి కమలనాథుడిగా రికార్డు సృష్టించారు. ఫలితాలు వెలువడిన నాటినుంచి ఆయనకు మంత్రి పదవి దక్కతుందనే ప్రచారం సాగింది. బీజేపీ తరఫున సీమాంధ్ర లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో మాణిక్యాలరావు సీనియర్ కావడం, సీమాంధ్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఉన్న సోము వీర్రాజు మాణిక్యాలరావుకు సన్నిహితులు కావడం, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండటం తదితర పరిస్థితుల నేపథ్యంలో మాణిక్యాలరావుకు మంత్రి పదవి దక్కింది. సామాన్యుడు ఇంత ఘనత దక్కించుకోవడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు ఈలి.. ఇప్పుడు మాణిక్యం
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత స్థానికుడికి మంత్రి పదవి దక్కడం ఇది రెండోసారి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆచంట రుక్మిణమ్మ, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన యర్రా నారాయణస్వామి, చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు వంటివారు మంత్రులుగా పనిచేసినా వారు ఈ ని యోజకవర్గానికి స్థానికేతరులే. మంత్రులుగా పనిచేసిన స్థానికుల్లో ఇప్పటివరకూ ఏకైక వ్యక్తి గా ఈలి ఆంజనేయులు మాత్రమే ఉన్నారు. ఆయన తర్వాత అలాంటి అవకాశం మాణిక్యాలరావుకు వచ్చింది.
రాజకీయ నేపథ్యం
విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. 7వ తరగతి చదువుతున్న రోజుల్లో జై ఆంధ్రా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాత పోరాటం చేశారు. భారతీయ జనతా పార్టీ అవిర్భావం నుంచి ఆ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా, జిల్లా శాఖ ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా శాఖ అధ్యక్షునిగా పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, సీమాంధ్ర ఉద్యమ కమిటీ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.