బెజవాడలోని సత్యనారాయణపురంలోని తాడంకి వారి వీధిలో గ్రూప్ హౌస్‌లో నివాసం ఉంటున్న పుణ్యవతి (57), ఆమె మనుమరాలు సాయి చంద్రిక (15)లను ఓ దుండగుడు గొంతుకలు కోసి ప్రాణాలు తీశాడు.
సాక్షి, విజయవాడ: బెజవాడలోని సత్యనారాయణపురంలోని తాడంకి వారి వీధిలో గ్రూప్ హౌస్‌లో నివాసం ఉంటున్న పుణ్యవతి (57), ఆమె మనుమరాలు సాయి చంద్రిక (15)లను ఓ దుండగుడు గొంతుకలు కోసి ప్రాణాలు తీశాడు. ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి బంగారం కోసం గాలించాడు. బంగారం దొరక్కపోవటంతో వృద్ధురాలి మెడలో గొలుసుతో పరారయ్యాడు. పుణ్యవతి భర్త చక్కా సత్యనారాయణ.. కుమారులు శ్రీనివాసరావు, కిరణ్‌లతో కలిసి వన్‌టౌన్‌లో బంగారం, వెండిషాపు నిర్వహిస్తుంటారు. హత్యకు గురైన సాయిచంద్రిక కిరణ్ పెద్ద కుమార్తె. కిరణ్ భార్య శారద పెద్ద కుమార్తె చంద్రికను నాన్నమ్మ దగ్గర విడిచిపెట్టి చిన్న కుమార్తెను తనతో తీసుకుని పుట్టిల్లైన గుంటూరుకు వెళ్లారు.
సత్యనారాయణ తన కుమారులతో కలిసి బంగారం షాపునకు వెళ్లారు. పుణ్యవతి, మనవరాలు సాయిచంద్రిక ఇంటి వద్దే ఉన్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో సాయిచంద్రిక ఆ వీధిలో స్నేహితులతో ఆడుకుంటూ నాన్నమ్మ వద్దకు వెళ్లి ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్లింది. అప్పటికే నాన్నమ్మ రక్తపు మడుగులో పడిఉంది. నాన్నమ్మ పరిస్థితి చూసి ఏడుస్తూ ఇంట్లోకి పరుగులు తీయడంతో చంద్రికను కూడా చంపేశాడు. పైకి వెళ్లిన స్నేహితురాలు ఎంతకీ రాకపోవడంతో ఆమె స్నేహితులంతా కలిసి వెళ్లి చూసి గట్టిగా కేకలు వెయ్యడంతో వీధిలోని వారు హుటాహుటిన వచ్చి చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లిఫ్ట్ మెకానిక్ రవిని నిందితుడిగా పోలీసులు గుర్తించి విచారిస్తున్నారు.