ఖాళీగా ఉన్న రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ను ప్రకటించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఖాళీగా ఉన్న రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. రిజర్వేషన్ల వర్తింపులో అక్రమాలు జరిగాయని ఎన్నికలు బహిష్కరించిన నవాబ్‌పేట మండలం మమ్మదాన్‌పల్లి సహా సర్పంచ్ మరణంతో ఖాళీ అయిన పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట పంచాయతీలకు ఈ నెల 18న ఎన్నికలు జరుగుతాయని ఎస్‌ఈసీ కమిషనర్ రమాకాంతరెడ్డి తెలిపారు. వీటితో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న 31 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల మూడో తేదీ నుంచి 6వ తేదీ వరకు కొనసాగుతుందని, ఏడో తేదీన నామినేషన్ల పరిశీలన, 8న ఆర్డీవో స్థాయిలో అభ్యంతరాలపై అప్పీళ్లు, 9న వాటి పరిష్కారంపై విచారణ, 10న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ అని రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. 18న ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్, ఆ తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.