పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం?
చిత్తూరు జిల్లా పుత్తూరులో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఆ ఇంట్లో మరో నలుగురి వరకు అల్ ఉమా ఉగ్రవాదులున్నట్లు అనుమానిస్తున్నారు. అంబులెన్స్ను తెప్పించిన పోలీసులు ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఐఏ బృందం పుత్తూరుకు చేరుకుంది. విషయం తెలిసిన వెంటనే ఆక్టోపస్ బలగాలను అక్కడకు తరలించినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సుమారు 30 మంది ఆక్టోపస్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అల్ ఉమా ఉగ్రవాది బిలాల్ మాలిక్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందటంతో చెన్నై పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ హత్యకేసులో బిలాల్ మాలిక్ నిందితుడు. ఇక్కడి ఉగ్రవాదులు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 1998 ఫిబ్రవరి 15న కోయంబత్తూరులో 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58మంది మృతి చెందగా, సుమారు 200మందికి పైగా గాయపడ్డారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పుత్తూరు మేదర వీధిలోని ఓ నివాసంలో శుక్రవారం రాత్రి నుంచే తమిళనాడు, ఆంధ్రా పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఓ కానిస్టేబుల్ మరణించగా.. సీఐ కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను రుయా ఆస్పత్రికి, అక్కడినుంచి చెన్నైకి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కొద్ది నెలల క్రితం నలుగురు వ్యక్తులు బీడీ కార్మికులుగా ఇల్లు అద్దెను తీసుకున్నారు. అయితే వాళ్లు రాత్రిళ్లే ఇంట్లో ఉండేవారని, వారి గురించి పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీడియా సహకరించాలని.... పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి ఓ అంబులెన్స్ చేరుకోవటంతో ఏం జరిగిందా అనే ఉత్కంఠ నెలకొంది.