సోంపేట:మాయదారి విషవాయువు రెండు ప్రాణాలను బలితీసుకుంది. కూటికోసం పనులు చేసుకునే ఇద్దరు కార్మికుల్ని పొట్టన పెట్టుకుంది. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. సోంపేట పట్టణం మొత్తం నిర్ఘాంతపోయిన ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. రోజువారీ కూలీకి తాపీ మేస్త్రీలుగా పనిచేస్తూ, చక్కని నైపుణ్యంతో రాణిస్తున్న ఇద్దరు యువకులు పొందర సురేష్(21), తోటి మేస్త్రి గొరగ షణ్ముఖరావు(30)లు ఎప్పటిలాగే మంగళవారం తమ తోటిపనివారితో పట్టణంలోని చిన్నజాలారి వీధిలో జి.హేమరాజు ఇంట్లో పనికి వెళ్లారు. అక్కడ నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంకు సెంటరింగ్‌ను తీయటానికి ఇరుకైన రంధ్రంలోంచి మొదట గొరగ షణ్ముఖరావు దిగాడు.
కొంతసేపటికి ఊపిరాడక రక్షించమని కేకలు వేయటంతో... ఏమైందోనని పొందర సురేష్‌కూడా లోనికి దిగాడు. అతనికీ అదే పరిస్థితి ఎదురవ్వటంతో ఇద్దరూ లోపలి నుంచి రక్షించండంటూ పెద్దగా కేకలు వేశారు. అక్కడ ఉన్న స్థానికులు, పై అంతస్థులో పనిచేస్తున్న తోటి పనివారికి సమాచారం అందజేయటంతో అంతాకలిసి సెప్టిక్ ట్యాంకులో ఇరుక్కొని అపస్మారక స్థితిలో ఉన్న సురేష్, షణ్ముఖరావులను బయటికి తీసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఇద్దరూ మృతిచెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కంచిలి ఎస్‌ఐ కె.వెంకటసురే ష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరణంలోనూ వీడని స్నేహ బంధం
సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక మృతిచెందిన భవన నిర్మాణ కార్మికులు సురేష్, షణ్ముఖరావులు మంచి స్నేహితులు. చివరికి మృత్యువొడికి కూడా కలిసే చేరుకున్నారు. వీరు మంగళవారం పనికి ఉపక్రమించిన సెప్టిక్ ట్యాంక్ రంధ్రం చాలా చిన్నదిగా ఉండటం, అందులో దిగిన నీటికి సూర్యరశ్మి తగలకపోవడంతో అదికాస్తా మురిగిపోయి విషవాయువు విడిచిపెట్టినట్టుంది. అది తెలియక అందులో దిగి పనికి ఉపక్రమించారు. అదే వారిపాలిట మృత్యువుగా మారిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుల్లో గొరక షణ్ముఖరావు పలాసపురం గ్రామంలో చేనేత కార్మిక కుటుంబానికి చెందిన వ్యక్తి.
చేనేత కార్మికులకు వారి వృత్తిపరంగా సరైన ఉపాధిలేకపోవటంతో అలవాటులేని తాపీమేస్త్రి పనికి పొట్టకూటికోసం వచ్చి ఇలా అర్ధంతరంగా మృతిచెందటంతో అతడి కుటుంబం ఆసరా కోల్పోయింది. ఇతనికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు అవినాష్, ఆకాష్‌లు, తండ్రి గవరయ్య, తల్లి పార్వతి ఉన్నారు. వీరందరికీ షణ్ముఖరావే ఆధారం. ఇతడి మృతితో ఆ కుటుంబమంతా వీధిన పడింది. ఇక మరో మృతుడు సోంపేట పట్టణం సీతారాంపేటకు చెందిన పొందర సురేష్ అవివాహితుడు. ఇతనికి తల్లి పార్వతి, ఒక సోదరుడు ఉన్నారు. అందివచ్చిన కుమారుడు తిరిగిరాని అనంతలోకాలు వెళ్ళిపోవటంతో ఆ తల్లి హృదయవేదన చూసే వార్ని కలచివేసింది. మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తోటి కార్మికులు, కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఊపిరి తీసిన విషవాయువు
Published Tue, Jul 21 2015 11:58 PM | Last Updated on Sat, Aug 25 2018 5:29 PM
Advertisement