అటవీప్రాంతంలో తప్పిపోయిన వారితో సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది
మైదుకూరు టౌన్ : అటవీ ప్రాంతంలో వివాహ దినోత్సవ వేడుక జరుపుకోవాలనుకున్న ఓ వ్యక్తి నిర్ణయం ఇద్దరు యువకులకు ముప్పు తెచ్చి పెట్టింది. అటవీ ప్రాంతంలో దారి తప్పి చివరకు పోలీసుల సాయంతో బతికి బయటపడ్డారు. వివరాల్లోకెళితే.. ప్రొద్దుటూరు మండలం భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న షరీఫ్ మంగళవారం తన 20వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనేందుకు స్నేహితులను తీసుకొని ట్రాక్టర్, జీపులో మైదుకూరు సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాతంలో భైరేని స్వామి దైవ క్షేత్రానికి వెళ్లారు. భోజనం అనంతరం సాయంత్రం వడ్డే శివకుమార్, మోటకట్ల శివసాగర్ అనే వ్యక్తులు షరీఫ్‌కు వివాహ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతిని ఇవ్వాలని ఆలోచించి వారిద్దరూ ద్విచక్రవాహనంలో మైదుకూరుకు బయలుదేరి వెళ్లారు. అయితే అప్పటికే చీకటి పడటంతో అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు, పాములు సంచరించడం చూసి వాహనాల్లో వెళ్లిన వారిని తీసుకొని షరీఫ్ తిరుగు ప్రయాణమయ్యాడు.
ఈ విషయం శివకుమార్, శివసాగర్‌కు తెలియకపోవడంతో పట్టణానికి వెళ్లి కేక్‌ను తీసుకొని భైరవ కోన వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంతలో రెండు ఎలుగుబంట్లను చూడటంతో భయాందోళనకు గురై వారు తమ ద్విచక్రవాహనంలో పరారయ్యారు. అయితే వారు వచ్చిన దారి తప్పి అటవీ ప్రాంతం లోపలికి వెళ్లారు. శివకుమార్ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ ద్వారా తాము అడవిలో దారి తప్పామని అతని సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె పోలీస్ కంట్రోల్ 100కు డయల్ చేయడంతో మైదుకూరు పోలీసు స్టేషన్‌లో సెంట్రీ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ ద్వారకాకు సమాచారం అందింది. దీంతో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు 100కు వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా అటవీ ప్రాంతంలోని యువకులతో మాట్లాడి వారి వద్ద ఉన్న గూగుల్‌యాప్ లొకేషన్ ఆధారంగా స్పెషల్ పార్టీ, పోలీస్ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున తప్పిపోయిన వారి ఆచూకీ తెలుసుకుని వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ యువకులు అడవిలో భయపడటం వల్లే దారి తప్పారని.. వారు చదువుకున్న వారు కావడం.. సెల్‌ఫోన్ టెక్నాలజీపై వారికి అవగాహన ఉండటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వారి ప్రాణాలు రక్షించామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తప్పిపోయిన వారి ఆచూకీ గుర్తించండంలో స్పెషల్ పార్టీ సిబ్బంది రామచంద్ర, చంద్ర, నరసింహులుతో పాటు కానిస్టేబుళ్లు సుబ్బయ్య, ప్రసాద్, గోవర్దన్‌రెడ్డిలు కీలక పాత్ర పోషించారని వారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment