
ఉదయ్.. హీరో చట్రంలో బందీ అయ్యారు!
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎంతసేపు తాను స్టార్ హీరోనన్న చట్రంలో ఉదయ్ కిరణ్ బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ సతమతమయ్యేవాడని ఆయన భార్య విషిత పోలీసులకు చెప్పారు. సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం.. ఇవన్నీ ఉదయ్‌పై ప్రభావం చూపాయని వివరించారు. పలుచోట్ల విలువైన స్థలాలున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఉదంతంపై మరింత సమాచారం సేకరించేందుకు బంజారాహిల్స్ పోలీసులు గురువారం మరోమారు విషిత, ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్ మున్నాలను వేర్వేరుగా ప్రశ్నించారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్ కిరణ్ వచ్చేనెల 18న భార్య విషితతో కలిసి చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
అక్కడ నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకున్నాడు. 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించాడు. చెన్నై వెళ్లి తమిళ సినిమావకాశాల కోసం ప్రయత్నించాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత పోలీసులకు తెలిపారు. విచారణలో తాను ఉదయ్‌ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని పలుమార్లు నెత్తి బాదుకున్నారు. కూతురి జీవితం సర్వనాశనమైందంటూ ఆమె తండ్రి కూడా పోలీసుల ముందు వాపోయారు. కాగా, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ సినిమాను ఉదయ్ కిరణ్ హీరోగా నిర్మిస్తున్న మున్నా... సినిమా ఖర్చులకు ఉదయ్ పేరు చెప్పి చాలా మంది వద్ధ అప్పు వసూలు చేసినట్లు తేలింది. సుమారు 12 చోట్ల అప్పులు చేయడంతో వారంతా గత మూడు నాలుగు నెలలుగా ఉదయ్‌కిరణ్ ఇంటి చుట్టూ తిరిగారు.
లిఫ్ట్‌కు వాడే తాడుతో ఉరి: ఉదయ్ కిరణ్ ఉరేసుకోవడానికి వాడిన తాడు ఎక్కడ్నుంచి వచ్చిందన్న అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. లిఫ్ట్ పాడైనప్పుడు లేదా ఆగినప్పుడు పైకి లాగేందుకు ఆ తాడును అపార్ట్‌మెంట్‌వాసులు వినియోగిస్తున్నట్లు తేలింది. అవసరం లేని సమయంలో ఆ తాడును టైపై ఓ మూలన పడేస్తారు. ఉదయ్ తాను ఉరేసుకోవడానికి ముందు తాడును ఇంట్లోకి తెచ్చుకొని ఉంటాడని పోలీసులు తెలిపారు. తాడు పొడవుగా ఉండడంతో ఉరికి సరిపోయేంత మేర కత్తిరించి, మిగతా తాడును మళ్లీ టైపై వేసి వచ్చినట్లు భావిస్తున్నారు. తొలుత భార్య విషిత చున్నీతో ఉరేసుకోవాలని భావించి, బీరువాలో ఉన్న రెండు చున్నీలను బయటకు తీశాడు. కానీ ఆ రెండు ఫ్యాన్ కొక్కానికి అందకపోవడంతో తాడును వినియోగించినట్లు తెలుస్తోంది. ఉరేసుకునే ముందు ఎలా చనిపోవాలన్న దానిపై కిరణ్ చాలాసేపు తర్జనభర్జన పడ్డట్లు అక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ముందుగా చేతి మణికట్టు వద్ద కోసుకొని చనిపోవాలని భావించాడు. కత్తితో మణికట్టు తెంచుకునేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు చెబుతున్నారు.