
ముక్కంటికి పంగనామాలు
► ఉగాది ఉత్సవాల్లో చేతివాటం
► భారీగా వీఐపీ టిక్కెట్ల రీసైక్లింగ్
► గురువారం వెలుగులోకి వచ్చిన ఘటన
► మల్లన్న ఆదాయానికి గండి
► కప్పిపుచ్చుకుంటున్న ఆలయ అధికారులు
► ఓ మీడియా బృందంపై ఈఓ మండిపాటు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆలయ సిబ్బంది చేతి వాటం చర్చనీయాంశమవుతోంది. భక్తుల రద్దీ వీరికి వరంగా మారుతోంది. వీఐపీ బ్రేక్ టికెట్ల రీసైక్లింగ్‌తో దేవస్థానం ఆదాయానికి లక్షల్లో గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సాక్షి, కర్నూలు: ఉత్సవాలు వస్తే శ్రీశైలాలయ ఉద్యోగులకు పండగే. స్వామి ఆదాయానికి గండికొట్టి మరీ అక్రమార్జన సాగిస్తున్నారు. టికెట్ల రీసైక్లింగ్ వ్యవహారం గురువారం వెలుగులోకి వచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కర్ణాటకతో పాటు మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున స్వామి, అమ్మవార్ల దర్శనార్తం తరలివచ్చారు. ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఉంటారనేది అధికారుల అంచనా. ఇదే అదనుగా ఆలయ అధికారులు కొందరు అక్రమార్జనకు తెరతీశారు.
దర్జాగా దర్శన టికెట్ల దందాకు శ్రీకారం చుట్టారు. వీఐపీలకు ప్రత్యేక కౌంటర్లలో అందజేసే ఒక్కో బ్రేక్ టిక్కెట్ ధర రూ.500. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో భక్తులు ఈ టిక్కెట్లతోనే దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒకసారి వినియోగించిన టిక్కెట్లను ఆలయ సిబ్బంది ద్వారా తిరిగి భక్తులకు విక్రయించడం జరుగుతోంది.
తేలు కుట్టిన దొంగలు
గురువారం రాత్రి అనుమతి లేని వీఐపీ బ్రేక్ రూ.500 టిక్కెట్లతో దర్శనానికి వచ్చిన ఇద్దరు కర్ణాటక భక్తులను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) మహేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సదరు యాత్రికులు తమకు భిక్షపతి మఠం వారు టిక్కెట్లు ఇచ్చినట్లు చెప్పారు. మఠం సిబ్బంది ఆలయ దర్శన టికెట్లను ఎలా ఇస్తారని ఏసీ ఆ భక్తులను ప్రశ్నించారు. దీంతో వాళ్లు నీళ్లు నమలడంతో బండారం బయటపడింది.
భిక్షపతి మఠం మేనేజర్ మల్లికార్జునను ఏసీ పిలిపించి విచారించగా మొదట తమ పిల్లలతో 7వ తేదీ ఉదయం క్యూలో తెప్పించుకుని సాయంకాలం దర్శానానికి వచ్చామని సమాధానమిచ్చారు. తర్వాత కాసేపటికి ఆ టికెట్లు ఆలయ ఏఈఓ రాజశేఖర్ ఇచ్చారని వివరణ ఇచ్చారు. కంగుతిన్న ఏసీ మహేశ్వరరెడ్డి.. ఏఈఓ రాజశేఖర్‌ను వివరణ కోరగా ఆయన చేతులెత్తేశారు. దీంతో విషయం ఈఓ సాగర్‌బాబు దృష్టికి చేరింది.
కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు
దర్శన టికెట్ల బాగోతం మీడియా దృష్టికి చేరడంతో కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై ఈఓ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను ఈవోనని.. మిమ్మల్ని దేవాలయంలోనికి కూడా అనుమతించేది లేదంటూ ఓ ఎలక్ట్రానిక్ మీడియా(సాక్షి కాదు) బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మీడియా ఒత్తిడి మేరకు వివరణ ఇస్తూ.. ఆ టిక్కెట్లు ముందు రోజు రాత్రి ఆలయ కౌంటర్‌లో తీసుకున్నారని, అయితే మరుసటి రోజు దర్శనానికి వచ్చారని పొంతనలేని సమాధానంతో దాటేశారు.
ఇంతలో ఏఈఓ రాజశేఖర్ కల్పించుకుని ఆ టిక్కెట్లు నకిలీవి కావని.. వీఐపీలు ఎవరైనా వచ్చినప్పుడు వారిని నేరుగా దర్శనానికి అనుమతిస్తే ఇతర భక్తులు గోల చేస్తారన్నారు. అందువల్ల ఒక్కోసారి వినియోగించిన వీఐపీ బ్రేక్ టిక్కెట్లను ప్రముఖులకు అందిస్తుంటామని కొత్త తరహా మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అధికారులు స్వయంగా ఇలాంటి దందాకు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది.