గరగ నృత్యాలతో చిందేసిన చింతలూరు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో గరగల జాతరలో ఆనందం ఉప్పొంగింది. గరగ నృత్యాలతో బుధవారం చింతలూరు చిందేసింది. ప్రతి అడుగులో జానపదం ఝళ్లుమంది. అసాదుల గజ్జెల సవ్వడిలో గోదావరి జిల్లాల సంస్కృతి పల్లవించింది. నూకాంబిక అమ్మవారి ఉగాది సంబరాల్లో భాగంగా డప్పుల మోతలు.. గరగ నృత్యాలతో చింతలూరు సంబరాల్లో మునిగితేలింది. పౌర్ణమి నుంచి చింతలూరులో జరుగుతున్న ఈ గరగ నృత్యాల కోలాహలం బుధవారం రాత్రి ముగిసింది. ఇక్కడి నూకాంబిక అమ్మవారిని స్థానిక చింతలూరి వంశస్థుల ఆడపడుచుగా భావిస్తారు. అందుకే గరగ వేడుక చివరి రోజున సంప్రదాయం ప్రకారం.. చింతలూరు వెంకట నీలాచలం ఇంట్లో మొక్కుబడి గరగ స్వీకరించి, చింతలూరు పూర్ణ ప్రభాకరరావు నివాసంలో పూల గరగ అందుకుంది నూకాలమ్మ తల్లి. అనంతరం గరగల ఆలయ ప్రవేశ ఘట్టం వైభవంగా జరిగింది. గ్రామదేవత మూలవిరాట్టుకు ప్రతిరూపంగా గరగలను భావించి.. పర్వదినాల్లో తీర్థ జాతరల్లో బయటకు తీసుకువస్తారు.
గరగల జాతరకు శతాబ్దాల చరిత్ర:
గర్భగుడిలో అమ్మవారిని అలంకరించినట్టుగానే చీర, గాజులు పూలు, పసుపు కుంకుమలతో ముస్తాబుచేసి గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. గ్రామదేవతను నమ్ముకున్న ఆసాదులు ఉగాదికి దాదాపు నెలరోజుల ముందు నుంచి గరగ నృత్యాలతో గ్రామంలో ఉత్సాహాన్ని నింపుతారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 35 గ్రామాల్లో 500మంది వరకు ఆసాదులున్నట్టు తెలుస్తోంది. చింతలూరు గరగలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచాయి. గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు, దేవి తదితర సినిమాల్లో చింతలూరు గరగ కళాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇక చింతలూరు నూకాలమ్మ జాతరలో ఈ ఏడాది కూడా గరగ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గరగల రూపంలో సాక్షత్తూ నూకాలమ్మే తమ ఇంటికి వచ్చిందని భావిస్తూ.. గ్రామస్తులు పసుపు కుంకుమలతో పూజించారు. చింతలూరివారి ఇలవేల్పు తమపాలిట కొంగుబంగారమై చింతలు తీరుస్తుందని పొంగిపోయారు.