ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..! | Dhanvantri Temple At Chintaluru Village In East Godavari District | Sakshi
Sakshi News home page

ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!

Published Thu, Oct 31 2024 10:23 AM | Last Updated on Thu, Oct 31 2024 10:41 AM

Dhanvantri Temple At Chintaluru Village In East Godavari District

ధన్వంతరి... నారాయణాంశ సంభూతుడు. మానవజాతికి చికిత్సా విధానాన్ని అనుగ్రహించిన  ఆదివైద్యుడు. శ్రీభాగవతం సహా వివిధ పురాణాల్లో ధన్వంతరి ప్రస్తావన ఉంది. అనేక ప్రాంతాల్లో ఆ ఆరోగ్య ప్రదాతకు గుడికట్టి పూజిస్తున్నారు. అందులో ఒకటి తెలుగు నేల మీదా ఉంది.

ఒకవైపు దేవతలూ మరోవైపు రాక్షసులూ – క్షీరసాగర మథనం ఓ యుద్ధంలా మహా తీవ్రస్థాయిలో జరుగుతోంది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి... ఆ వరుసలో పదకొండవవాడిగా పాలకడలిలోంచి స్ఫురద్రూపి అయిన ఓ పురుషుడు పుట్టుకొచ్చాడు. పెద్దపెద్ద కళ్లూ, ఒత్తయిన కేశాలూ, అంతెత్తు ఆకారం, చిరుదరహాసం... ఆ రూపాన్ని ముక్కోటి దేవతలూ రెప్పవాల్చకుండా చూశారు. 

అతను ధగ ధగ మెరిసే పీతాంబరాన్ని కట్టుకున్నాడు, మణికుండలాలు ధరించాడు, మెడలో దివ్యమాల మెరిసి΄ోతోంది. ఓ చేతిలో అమృతభాండం ఉంది. మరో చేతిలో వనమూలికలున్నాయి. అచ్చంగా శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు – కాదు కాదు, సాక్షాత్తూ నారాయణుడి అంశే! బ్రహ్మాదులు అతనికి ధన్వంతరి అని నామకరణం చేశారు. పురాణగాథలు... ఓసారి, దుర్వాస మహాముని శాపం కారణంగా... ముక్కోటి దేవతలూ ముక్కుతూ మూలుగుతూ మూలన పడాల్సిన పరిస్థితి వచ్చిందట. 

ఆ సమయంలో ధన్వంతరి అరుదైన వనమూలికలతో చికిత్సలు చేసి... అమరుల్ని ఆరోగ్యవంతుల్ని చేశాడని ఐతిహ్యం. ధన్వంతరి ప్రస్తావన ఒక్కో పురాణంలో ఒక్కోలా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం...ధన్వంతరి సూర్యనారాయణుడి ప్రియశిష్యుడు. ఆయన దగ్గరే ఆయుర్వేదం నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం... ద్వితీయ ద్వాపరయుగంలో కాశీ రాజ్యాన్ని పాలించిన చంద్రవంశ రాజు ధనపాలుడి కొడుకుగా అవతరించిన ధన్వంతరి... ఆయుర్వేదాన్ని శాస్త్రంగా మలిచి శుశ్రుతుడితో సహా ఎంతోమందికి బోధించాడనీ... అనేక సంవత్సరాల పాలన తర్వాత.. తిరిగి దైవత్వాన్ని పొందాడనీ పురాణ కథనం. 

ఆయుర్వేద వైద్యులకు ధన్వంతరే తొలిదైవం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధన్వంతరి ఆలయాలున్నాయి. చింతలూరు గ్రామాన... తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. గౌతమీ తీరాన, పచ్చని పంటపొలాల మధ్య, సుమారు రెండెకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఆ ఆలయంలో అడుగు పెట్టినంత మాత్రానే... సమస్త రోగాలూ నయమైపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. విశాలమైన ముఖ మండపం ఉంది. 

గర్భాలయంలో ధన్వంతరి దివ్య మంగళరూపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. నాలుగు హస్తాలతో...ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో అమృతకలశం, ఒక చేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఓ భాగం. చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి ఉందా జీవికి. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని నిర్మించారు. 

పూజాదికాలకు ఏ లోటూ లేకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రామంలోనే పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన వంశీకులైన ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి చలువరాతితో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ గుడి రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఏటా కార్తిక బహుళ త్రయోదశినాడు ధన్వంతరి జయంతిని వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాట... ఇతర ప్రాంతాల్లో.,, తమిళనాడులోని సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీరంగం. అక్కడున్న రంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరి ఉపాలయం ఉంది. ఏ గుడిలో అయినా తీర్థంగా అభిషేక జలం ఇస్తారు. 

మహా అయితే, పంచామృతం పోస్తారు. ఇక్కడ మాత్రం వనమూలికలతో కూడిన కషాయాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకుంటే మొండివ్యాధులు సైతం మటుమాయమైపోతాయని ఓ నమ్మకం. కంచి వరదరాజ పెరుమాళ్‌ ఆలయ ఆవరణలోనూ ఆ ఆరోగ్యదేవుడి విగ్రహం ఉంది. కేరళలోని గురువాయూర్‌ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టేవారు...ముందుగా స్వామిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. కాలికట్‌ దగ్గర్లోనూ ఓ ధన్వంతరి క్షేత్రం ఉంది. 

ధన్వంతరి అంటే... 
మనసుకు పట్టిన జాడ్యాల్నీ, శరీరాన్ని కమ్ముకున్న వ్యాధుల్నీ తొలగించేవాడనీ ధన్వంతరి అనే పదానికి అర్థం. పురాణాల ప్రకారం...ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం ్ర΄ాచీన సంప్రదాయం. ధనత్రయోదశినాడు లక్ష్మీదేవితో ΄ాటూ ధన్వంతరినీ పూజిస్తారు. ఏటా కార్తికమాసంలో ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. సముద్ర తీరంలోనో స్వగృహంలోనో వైద్యశాలలోనో కలశాన్ని స్థాపించి...పురాణాంతర్గతమైన ధన్వంతరి మహామంత్రాన్ని పఠించి... వైద్యులకూ సంపూర్ణ ఆరోగ్యవంతులకూ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. పెసర పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం

– డి.వి.ఆర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement