సాక్షి, గుంటూరు: ‘నమ్మకం ఎరుగని నాయకుడు.. మాయ మాటలు చెప్పే మాంత్రికుడు. కుట్రలు చేసే కుతంత్రికుడు. ప్రశ్నిస్తే బెదిరించే పాలకుడు. అభివృద్ధికి మారుపేరు నేనంటూ చెప్పుకునే ఢాంబికుడు.. వెనుకబడిన వర్గాలను విస్మరించిన వంచకుడు’ అంటూ అలవికాని హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నిన్నెలా నమ్మేదంటూ నిట్టూరుస్తున్నారు.
హామీలు మరిచారు
గత ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రచారానికి మిమ్మల్ని రానివ్వకుంటే మాదిగజాతి మీకు అండగా ఉండి స్వాగతించింది. మీ పాదయాత్రలో మాలమహానాడు కార్యకర్తలు రాళ్లురువ్వితే మాజాతి ముందుండి నడింపించింది. అదిలాబాద్ జిల్లా భైంసా ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలో మా బిడ్డలు నలుగురు ప్రాణాలను అర్పించారు. ఆ సమయంలో చనిపోయిన వారికి ఒక్కక్కరికీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ‘నాకోసం ప్రాణాలర్పించిన ఆ నలుగురి సాక్షిగా చెబుతున్నాను.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు అండగా నిలుస్తాను’ అని అన్నారు. గతంలో వర్గీకరణ చేసిందినేనే.. మళ్లీ అధికారంలోకి వచ్చాకా చేసేది కూడా నేనే అంటూ ఇచ్చిన హామీ ఏమైంది. నిన్ను నమ్మి ఏపీ రాష్ట్రంలోనూ పూర్తిగా మీకు సహకరించాం. విశాఖలో ముగిసిన పాదయాత్రలోనూ అవే మాటాలు చెప్పారు. ఐదేళ్ల పాలన ముగిసినా నేటికీ మీరిచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు...ఇంక నిన్ను నమ్మం బాబూ.
– కోట సుబ్బుమాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జీ, ఎమ్మార్పీస్
రుణమాఫీకి శఠగోపం
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి డ్వాక్రా మహిళలు మోసపోయారు. మహిళా స్వయంసహాయక సంఘాలకు రుణమాఫీ హామీని నమ్మిన మహిళలు బ్యాంకులకు రుణాలు కట్టక డిఫాల్టర్లుగా మారారు. కొన్ని సంఘాల నిర్వీర్యమయ్యాయి. డ్వాక్రా మహిళలు బ్యాంకు అప్పులు తీర్చేందుకు నానా అవస్థలు పడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాకా రుణమాఫీ కాదు ప్రోత్సహకంగా ఒక్కొ సభ్యురాలికి రూ.10వేలు అందజేస్తామని మాటమార్చింది.
2015, 2016 సంవత్సరాల్లో రెండు విడతలుగా రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంది. తీరా ఎన్నికలు సమీపించడంతో అక్కచెల్లెమ్మలకు పసుపు కుంకుమ కింద ఇస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి అవికూడా మూడు దఫాలుగా ఇస్తానంటూ ముందుస్తు చెక్కుల్ని పంపిణీ చేశారు. కేవలం ఎన్నికల సమయంలో ఆ డబ్బుల్ని తీసుకున్న మహిళల ఓట్లును కాజేసేందుకు ఇచ్చిన విషయం అంతా గ్రహించారు. అందుకే మహిళలెవ్వరు నిన్ను నమ్మరు బాబూ!
– పిడతల ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యురాలు యడ్లపాడు
నిరుద్యోగ భృతి ఏదీ ?
సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు కచ్చితంగా ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మంత్రులు హామీ ఇచ్చారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న వారికి వారికిష్టమైన రంగాలేవో గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆయా విభాగాల్లోనే ఉపాధిని కల్పిస్తామంటే సంతోషించాం. ఎస్టీ కుటుంబానికి చెందిన మా ఇంట్లో నా అన్న శేఖర్‌నాయక్ డిగ్రీపూర్తి చేసి ఐదేళ్లు, నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు గడిచాయి.నిబంధనల పేరిట అనర్హులగా ప్రకటించి భృతి ఇవ్వడం లేదు.
నా తండ్రి మతనాయక్ నా చిన్నతనంలోనే మృతి చెందితే అమ్మ రమణిబాయి నిరక్ష్యరాస్యురాలైనా క్వారీల్లో కంకకొట్టి, వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ మా ఇద్దరిని చదివించింది. మాకు ఎలాంటి ఆసరా లేదు. దశాబ్దాల కిందట ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు కూలిపోయింది. కనీసం ఇంటి రుణమిచ్చి ప్రొత్సహించిన పాపాన పోలేదు. కనీసం నిరుద్యోగ భృతి వస్తే కుటుంబానికి కాస్తంత ఆసరా అవుతుందంటే దాన్ని ఇవ్వలేదు. అర్హత ఉండి భతి పొందలేని నిరుద్యోగులు నిన్ను ఎందుకు నమ్మాలి బాబూ?
– వి వెంకటేశ్వరనాయక్, బోయపాలెం, యడ్లపాడు మండలం
Comments
Please login to add a commentAdd a comment