
‘అది డబ్బులు తోడే ప్రాజెక్ట్’
రాజమహేంద్రవరం: పట్టిసీమ నీళ్లు తోడే ప్రాజెక్టుకాదని, డబ్బులు తోడే ప్రాజెక్టు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, కనీసం ఆఫీస్ అటెండర్ నుంచి కూడా సమాధానం రాలేదని వాపోయారు.
ప్రభుత్వ పనితీరును అంచనా వేసేందుకు కాగ్ నివేదికే సరైన ఆయుధమన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని వెల్లడించారు. వైఎస్ రాజశేఖరెడ్డి చేపట్టినన్ని సాగునీటి ప్రాజెక్టులు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని తెలిపారు. ‘రాజా ఆఫ్ కరప్షన్’పై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని ఇంతకుముందు ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన సవాల్‌పై ప్రభుత్వం తోకముడిచిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చ కోసం మంగళవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు.