
చెంబులతో నీళ్లు పోసి జరిగిపోయిందంటే ...
రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్ట్లో రూ. 490 కోట్లు మేర అక్రమాలు జరిగాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. పట్టిసీమ అక్రమాలపై ఆరోపిస్తే ఎందుకు సమాధానం చెప్పడంలేదని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. శనివారం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ... కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం జరగలేదని ఆయన అన్నారు. చెంబులతో నీళ్లు పోసి జరిగిపోయిందంటే కుదరదన్నారు.
ఒకింగ్హాం కాల్వ సమయంలోనే కాల్వల అనుసంధానం ఉండేదని ఉండవల్లి అరుణ్కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెలగలేరు వద్ద 350 ఎకరాల చెరువును పూడ్చి పెట్టి ఆగమేఘాలపై కాల్వ తవ్వేశారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య రహస్య అగ్రిమెంట్ ఏమైనా అయ్యిందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒడిశాను మంచి చేసుకోవడానికి పోలవరం ప్రాజెక్ట్ను ఆపారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు.