
'గన్నేరుపప్పు పెడుతున్నారు'
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు అవసరం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పని పూర్తి చేయకుండా పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పనులు పూర్తికాకుండా జాతికి అంకితం చేయడం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు.
పట్టిసీమకు, రాయలసీమకు సంబంధం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు పప్పన్నం పెడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చంద్రబాబు అంటున్నారని... పప్పన్నం కాదు గన్నేరుపప్పు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణాలోకి మళ్లించింది తాటిపూడి ఆయకట్టు నీరు అని పట్టిసీమ నీరు కాదని స్పష్టం చేశారు. ఎందుకు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా పట్టిసీమ ఎందుకు తలపెట్టారని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే దేవతా వస్త్రాల కథ గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లు వైజాగ్ కు కూడా తీసుకోస్తామని చంద్రబాబు గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి అనేది చంద్రబాబు తన సొంత మనుషుల కోసం కట్టుకుంటున్న ప్రాకారమని ఉండవల్లి వ్యాఖ్యానించారు.