సాక్షి, న్యూఢిల్లీ: ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయాలన్న అభ్యర్థనకు సుప్రీంకోర్టు సమ్మతించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందని, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల రెండున్నరరెట్ల జరిమానా చెల్లించాల్సి రావడంతో పాటు.. రెండేళ్ల జైలుశిక్ష పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు కేసు కొట్టేశారు
‘తమపై ఉన్న క్రిమినల్ కంప్లయింట్‌ను కొట్టేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారించి డిసెంబరు 31, 2018న కొట్టేసిందని పిటిషన్‌లో మేం వివరించాం. రెండు రాష్ట్రాల్లోనూ డిపాజిట్లు సేకరించినందున ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్ చేయాలని మేం కోర్టును కోరగా అందుకు అంగీకరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు మీడియాలో రాలేదు. ఎవరికీ తెలియదు.
ఇలాంటి మరో కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి కలిసినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు విషయం తెలుసుకుని సుప్రీంకోర్టులో అప్పీలు చేశాం. ట్రయల్ కోర్టులో స్టేలు తెచ్చుకుని పుష్కరకాలం పాటు మార్గదర్శి కేసు ఆపుతూ వచ్చారు. డిపాజిటర్లు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ తెలంగాణను మాత్రమే పార్టీగా చేశారు. ఉమ్మడి హైకోర్టు ఆఖరి పనిదినం రోజున క్వాష్ చేయించుకున్నారు. కేసు కాలగర్భంలో కలిసిపోయిందనుకున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంలో అప్పీలు చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిని చేయాలని కోరాం. ఐపీఎస్ అధికారి కృష్ణరాజును కూడా కేసులో చేర్చారు. తదుపరి విచారణ నిర్వహిస్తామని కోర్టు చెప్పింది.
రుజువైతే రూ.7 వేల కోట్ల జరిమానా చెల్లించాలి
ఆర్‌బీఐ సెక్షన్ 45 (ఎస్) ప్రకారం హిందూ అవిభక్త కుటుంబం డిపాజిట్లు సేకరించకూడదని మా వాదన. దీనిని ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేస్తే రెండున్నర రెట్ల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినందున రూ. 7 వేల కోట్ల మేర జరిమానా చెల్లించాల్సి వస్తుంది. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినా సరే.. నేరానికి పాల్పడినందున శిక్ష తప్పదు. కృష్ణరాజు వేసిన కేసులో ఏనాడూ విచారణ జరగనివ్వలేదు. కాలు నొప్పి, చేయి నొప్పి, కాగితం సరిగా టైప్‌కాలేదు వంటి అనేక కారణాలు చెబుతూ విచారణకు అడ్డుపడుతూ వచ్చారు. తేడా ఉంది కాబట్టే విచారణకు నిలబడడానికి అంగీకరించలేదు.
మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌తో ఎలాగోలా బయటపడాలని చూశారు. దేశంలో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులు నిరూపించాయి. సుమారు రూ.7 వేల కోట్ల ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు ఇది. ఆర్థిక నేరాల్లో విచారణ జరగకుండా క్వాష్ చేయడానికి వీల్లేదని సుప్రీం గతంలో తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్పీలు చేసుంటే మాకు ఈ అవసరం ఉండేది కాదు. ఇదే హైదరాబాద్ (ఉమ్మడి) హైకోర్టులో ఈ తీర్పు వెలువడడానికి రెండు నెలల ముందు ఇదే తరహా కేసులో ఇంకో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. రామోజీరావు కేసులో వచ్చిన తీర్పునకు పూర్తి విభిన్నంగా ఉంది.
న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం
రూ. 2,600 కోట్ల మేర వసూలు చేసిన అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి, పద్మవిభూషణ్ పురస్కారం పొందిన వ్యక్తి విచారణకు కోర్టుకు రానని చెబితే, తప్పించుకునే మార్గం గనక చట్టం చూపిస్తే.. ఇక చట్టం డబ్బున్న వాళ్లకు ఒకటి.. లేనివాళ్లకు ఒకటి అనుకోవాల్సి వస్తుంది. ఈరోజు పిటిషన్‌ను సుప్రీం అనుమతించడం ద్వారా అలా అనుకోవాల్సిన అవసరం లేదన్న భావన ఏర్పడింది. కచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం’ అని ఉండవల్లి పేర్కొన్నారు. ఆయన తరపు న్యాయవాదులు ఎస్.సత్యనారాయణ ప్రసాద్, అల్లంకి రమేష్‌లు కూడా కేసు గురించి విలేకరులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment