వీఆర్‌ఎస్ ఉద్యోగుల పిల్లలతో చెలగాటం
ప్రభుత్వ ఉత్తర్వు అమలుచేయని వైనం
80 మంది నిరుద్యోగుల జీవితం అగమ్యగోచరం
విజయవాడ : రైల్వే అధికారులు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. విధి నిర్వహణలో వారు చొరవ తీసుకోకపోవడంతో విజయవాడ రైల్వే డివిజన్‌లో 80 మంది నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైల్వేలో పనిచేస్తూ వీఆర్‌ఎస్ (మూడు సంవత్సరాలు సర్వీసు ఉండగా) తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు రైల్వే శాఖకు 2010లో దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్ల సర్వీసు ఉన్న వారు విజయవాడ రైల్వే డివిజన్ నుంచి 587 మంది దరఖాస్తు చేయడంతో వారికి వీఆర్‌ఎస్ ఇచ్చేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారి పిల్లలు పరీక్ష రాసేందుకు 2010 అక్టోబరు 9న దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఏడాది తరువాత 2011 డిసెంబరు 24న రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షల ఫలితాలు 2012 జనవరి 1న విడుదల చేశారు. నోటిఫికేషన్ సమయంలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహించాలనే ఆదేశాలు ఉన్నాయి.
ఈ ఆదేశాలను రద్దు చేస్తూ 2012 జనవరి 3న రైల్వే బోర్డు నుంచి రైల్వే జీఎంలు, డీఆర్‌ఎంలకు లేఖలు అందాయి. ఈ ఆదేశాలను డివిజన్ అధికారులు పట్టించుకోకుండా 2011లో పరీక్ష రాసిన వారికి 1500 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా పీఈటీ టెస్ట్‌లో పాసయిన వారికే ఉద్యోగాలు ఇవ్వడంతో అందులో ఉత్తీర్ణులు కానివారు 80 మంది మిగిలిపోయారు. 2011లో ఒక్కసారి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వీఆర్‌ఎస్‌లో వెళ్లే వారి పిల్లల కోసం రైల్వే శాఖ సంవత్సరానికి రెండు సార్లు నోటిఫికేషన్ ఇస్తుంది. రాత పరీక్ష, పీఈటీ టెస్ట్‌లో ఫెయిల్ అయిన వారికి తిరిగి పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని 2010/ఆర్‌టీ-2 ద్వారా బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను ఇక్కడి అధికారులు పట్టించుకోలేదు. రెండో చాన్స్ వస్తుందని పట్టించుకోకుండా ఉన్న వారి పిల్లలు 150 మంది వరకు ఉన్నారు. వీరి తల్లిదండ్రులకు ఉన్న సర్వీస్‌ను పరిశీలిస్తే మూడేళ్లకు మూడు నెలలు తగ్గింది. దీంతో వారు వీఆర్‌ఎస్ ద్వారా జరిగే టెస్ట్ రాసేందుకు అనర్హులయ్యారు. 2010 అక్టోబరు 9న దరఖాస్తు చేసుకొని పరీక్ష పాసైన వారందరికీ తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు, వీఆర్‌ఎస్ తీసుకుంటున్న తల్లిదండ్రులు కోరుతున్నారు.
నిరుద్యోగులతో రైల్వే ఆటలు
Published Sun, Jan 11 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement