
సాక్షి, అమరావతి: డిగ్రీ పూర్తి చేసిన వారినే నిరుద్యోగ భృతికి అర్హులుగా పరిగణించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సమావేశమైంది. డిగ్రీ తరువాత ఉన్నత విద్య అభ్యసించే వారిని అనర్హులుగా పరిగణించాలని, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
కుటుంబంలో కేవలం ఒక్కరికే భృతి అందించేలా విధివిధానాలు రూపొందించాలని తీర్మానించింది. అలాగే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులతోపాటు ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసేవారు నిరుద్యోగ భృతికి అనర్హులు. అర్హులైన నిరుద్యోగుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు మంత్రులు సూచించారు. జిల్లా కేంద్రంగా ఒక అధికారిని నియమించి, దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదనంగా దరఖాస్తులు వస్తే, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో నిర్ణయానికొచ్చారు.
ఉపాధి దొరకగానే భృతి కట్
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. అలా ఉపాధి కల్పించిన వెంటనే వారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి తొలగించి, కొత్తవారికి అవకాశం కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా విధివిధానాలు పక్కాగా రూపొందించాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
నిరుద్యోగుల్లో అసంతృప్తి
అర్హతల పేరిట నిరుద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సర్కారు తాజా నిర్ణయాలపై నిరుద్యోగులు తీవ్ర అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ తర్వాత పెద్ద చదువులు చదువుకున్న చాలామంది ఇప్పటికీ ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. వీరికి భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment