ఆధ్యాత్మిక శిఖరం... అద్వితీయ చరితం
అడుగడుగునా ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్న ఆధునిక జీవితంలో మార్గదర్శులైన ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఉండొచ్చు గాక.. కానీ వారందరిలో ఆయన మార్గం విభిన్నం. విశిష్టం. ధార్మిక పథంలో దారి చూపుతూనే, సరళ జీవన విధానం ప్రత్యేకతను ప్రబోధించే ప్రవక్త ఆయన. పురాణాలు, ఉపనిషత్తుల సారాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ, ఒడుపుగా ఎలా ముందుకు సాగాలో తేటతెల్లం చేసే సద్గురువు ఆయన.
తన జీవితమే ధార్మిక ప్రబోధంగా కాలం గడిపి, సద్గురువుగా వన్నెకెక్కి; అసంఖ్యాక అభిమానుల్ని ఆధ్యాత్మిక భావనా వాహినిలో పునీతుల్ని చేసిన మానస సరోవర సమానుడు, విలక్షణ వ్యక్తిత్వ సంపన్నుడు శివానందమూర్తి. విశాఖలో ఎన్నో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దదిక్కుగా నిలిచి, భీమిలిలో ఆనందవన స్థాపన ద్వారా సౌజన్య పవనాలు వ్యాపింపజేసిన సద్గురువు బుధవారం వరంగల్‌లో కాలధర్మం చెందినా, ఆధ్యాత్మిక శిఖరంగా సాగరతీరాన శాశ్వతంగా కొలువై ఉంటారు.