మనస్పర్ధలొస్తే తెగదెంపులే! | They have dividing if small issue happen | Sakshi
Sakshi News home page

మనస్పర్ధలొస్తే తెగదెంపులే!

Published Mon, Nov 7 2016 3:52 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

మనస్పర్ధలొస్తే తెగదెంపులే! - Sakshi

మనస్పర్ధలొస్తే తెగదెంపులే!

చిన్నపాటి తగవులకే విడిపోతున్న దంపతులు
- గృహహింస చట్టం వైపు పరుగులు  రాష్ట్రంలో 15,235 కేసులు నమోదు
- రాజీ పడని కేసులే అధికం  2,383 కేసులకు తుది ఉత్తర్వులు జారీ
 
 సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక జీవితంలో ఆలూమగల మధ్య తలెత్తే మనస్పర్ధలు వారిని ఎక్కువగా తెగదెంపుల వైపు నెట్టేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవులు విడాకులకు దారితీస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, ఉద్యోగ తీరుపై అభ్యంతరాలు, వ్యక్తిత్వాల్లో వ్యత్యాసం వంటి కారణాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. దంపతుల మధ్య సయోధ్య కుదిరే కేసులు తక్కువగా ఉంటుండగా కోర్టును ఆశ్రయిస్తున్న సందర్భాలు అధికంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో మహిళలు ముందుగా గృహహింస చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు.

 వేలల్లో కేసులు...
 రాష్ట్రవ్యాప్తంగా గృహహింస చట్టం కింద ప్రస్తుతం 15,235 ఫిర్యాదులు దాఖలవగా వాటిలో కేవలం 1,429 ఫిర్యాదులకు సంబంధించి మాత్రమే ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. అధికారుల కౌన్సెలింగ్ ఫలితంగా వారంతా ఫిర్యాదులను వెనక్కు తీసుకున్నారు. కానీ మరో 10,779 ఫిర్యాదులకు సంబంధించి పరిష్కారం జటిలం కావడంతో డీఐఆర్ (డొమెస్టిక్ ఇన్సిడెన్ట్ రిపోర్టు) నమోదు అనివార్యమైంది. వీటిలో 818 కేసులకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు వెలువడగా 2,383 కేసులకు కోర్టులు తుది ఉత్తర్వులు జారీ చేశాయి. మిగతా కేసులు విచారణలో ఉన్నాయి.

 పట్టణ ప్రాంతాల్లో అధికం...
 గృహహింస చట్టం కింద పట్టణ ప్రాంత పరిధిలోనే అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో చదువుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉంటున్నారు. మరోవైపు మైనారిటీ వర్గాల్లో రెండో పెళ్లికి సంబంధించిన ఫిర్యాదులు సైతం ఎక్కువగానే ఉంటున్నాయి. గృహహింస చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా పోలీస్ స్టేషన్ నుంచి రిఫర్ చేసినవాటి సంఖ్య అధికంగా ఉంటోంది. ముందుగా పోలీస్‌స్టేషన్లో 498, 498 (ఏ) సెక్షన్ల కింద కేసుల నమోదుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైలుకు పంపుతున్నారు. దీంతో ఈ కేసుల్లో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకోవడం లేదు. డీవీ యాక్ట్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో రక్షణ, నివాసపు ఉత్తర్వులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ, నష్టపరిహారం కింద కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం పిల్లల సంరక్షణ మినహా మిగతా అన్ని కేటగిరీల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. చట్టంపై అవగాహన కల్పిస్తుండడంతో బాధిత మహిళల సంఖ్య వెలుగులోకి వస్తోంది.
 
  అధికారుల సంఖ్య అంతంతమాత్రమే...
 రాష్ట్రంలో జిల్లాల వారీగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ.. డీవీ యాక్ట్  సెల్స్ మాత్రం పాత జిల్లాల్లోనే పనిచేస్తున్నాయి. ఒక్కో సెల్‌లో ఇద్దరు కౌన్సెలింగ్ అధికారులున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండగా.. వాటిని పరిష్కరించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 4,027 కేసులుండగా ఇద్దరు కౌన్సెలింగ్ అధికారులు మాత్రమే ఉన్నారు. రాజధానిలో మరికొంత సిబ్బందిని పెంచితే పరిష్కారం సులభతరం అవుతుందని డీవీ యాక్ట్ సెల్ అధికారి కవిత ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement