సాక్షి, కడప : జిల్లాలో సమైక్యవాదం హోరెత్తింది. గత 63 రోజులుగా ఉద్యమంలో ఉత్సాహంగా ఉరకలేస్తున్న సకలజనులు గురువారం అదే హోరును కొనసాగించారు. పాఠశాలలు పునః ప్రారంభిస్తామని డీఈఓ ప్రకటించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. డీఈఓ, ఆర్జేడీ కార్యాలయాలను ముట్టడించారు. డీఈఓ అంజయ్య, ఆర్జేడీ సీహెచ్ రమణకుమార్‌లను ఘెరావ్ చేశారు. డీఈఓను సస్పెండ్ చేయాలని నినదిస్తూ, ఆర్‌జేడీ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారం నిర్మించారు.
గనులు భూగర్భశాఖ సీమాంధ్ర జేఏసీ కన్వీనర్ రంగారావు, కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి కళ్యాణ మండపంలో కార్యచరణను రూపొందించారు. ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీని చేపట్టారు.
ఎన్జీఓలు ఎంపీ సాయిప్రతాప్ ఇంటిని ముట్టడించి వంటా వార్పు చేపట్టారు. టీ.నోట్ ప్రకటన వెలువడిన వెంటనే అధికారులు కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. రిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి షిండే దిష్టిబొమ్మను శవయాత్రగా ఊరేగించి దగ్ధం చేశారు.
టీ.నోట్ ప్రకటన తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వద్ద మున్సిపల్ ఉద్యోగులు, నీటిపారుదలశాఖ సిబ్బంది రాస్తారోకో చేపట్టారు. అధికారులు, ఉద్యోగులు, ఎన్జీఓలు నగరంలో తిరుగుతూ దుకాణాలను మూసి వేయించారు.
జమ్మలమడుగులో దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పీఆర్ సంఘీభావం తెలిపారు. వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం, చర్లపల్లి స్కూలు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. జేఏసీ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో వంద కిలోమీటర్ల మేర మానవహారాన్ని చేపట్టారు.
ఇందులో మహిళలు, ప్రజలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీ.నోట్ ప్రకటన వెలువడినప్పటి నుంచే 72 గంటల బంద్ పాటిస్తున్నారు. ప్రొద్దుటూరులో సమైక్యవాదులు, ఎన్జీఓలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. రిలే దీక్షలు సాగుతున్నాయి.
రాయచోటి పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తలపై గోళాలు పెట్టుకుని రాష్ట్రం విడిపోతే కూలిపనులకు వెళ్లాల్సి ఉంటుందని నిరసన తెలిపారు. మేదరసంఘం, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలిపారు. నారాయణ స్కూలు విద్యార్థులు ర్యాలీ చేపట్టి సేవ్‌ఏపీ ఆకారంలో నిరసన తెలిపారు. పొలిటికల్ జేఏసీ, ఇతర అధికారులు సంఘీభావం తెలిపారు.
బద్వేలులో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీ.నోట్ వెలువడిందని విషయం తెలియగానే 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చి బంద్‌పాటిస్తున్నారు. బేల్దార్ల సంఘం ఆధ్వర్యంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అట్లూరులో ఆందోళనలు చేపట్టారు. పోరుమామిళ్లలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు.
పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టారు. టీ.నోట్ ప్రకటన వెలువడిందని తెలియగానే 72 గంటల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.
కమలాపురం పట్టణంలో ఉపాధ్యాయులు తెలంగాణ నోట్ వెలువడిందని తెలియగానే నోట్ పత్రాలను గాంధీ విగ్రహం వద్ద కాల్చివేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రాజంపేటలో మహిళా ఉపాధ్యాయులు మోకాళ్లపై నడుస్తూ నిరసన ర్యాలీని చేపట్టారు. టీ.నోట్‌కు వ్యతిరేకంగా రాజంపేటలో ఆందోళనలు ఉధృతమయ్యాయి.
సమైక్య నిరసనలు
Published Fri, Oct 4 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement