సమైక్య గర్జన | United Agitation become severe | Sakshi
Sakshi News home page

సమైక్య గర్జన

Published Mon, Sep 2 2013 3:46 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

United Agitation become severe

అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు సింహగర్జన చేస్తున్నారు. రాష్ట్ర విభజన ఆగేదాకా ఉద్యమ కెరటం ఎగిసిపడుతూనే ఉంటుందని స్పష్టీకరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఎన్జీఓ, ఉద్యోగ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. 33వ రోజైన ఆదివారం కూడా జిల్లాలో సమైక్య నినాదం మార్మోగింది. వాడవాడలా  దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పాలనా వ్యవస్థ స్తంభించిపోయింది.వైఎస్సార్‌సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం నుంచి తరలివచ్చిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తాడిపత్రి బస్టాండ్ , పాతవూరు, సప్తగిరి సర్కిల్, సుభాష్‌రోడ్డు, టవర్‌క్లాక్, నడిమివంక, శ్రీకంఠం సర్కిల్ తదితర ప్రాంతాల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది.
 
 అలాగే నగరంలో జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ పరిధిలోని ఎనిమిది ఉద్యోగ సంఘాల నేతలు జెడ్పీ ఎదుట రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, అధ్యాపకులు, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ, మెడికల్ జేఏసీ, న్యాయవాదులు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టవర్‌క్లాక్ సర్కిల్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోగటం విజయభాస్కర్‌రెడ్డి ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరింది.
 
 కాంగ్రెస్ నేతలు దీక్ష కొనసాగించారు. పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. రోడ్డు డివైడర్లకు ఉచితంగా పెయింటింగ్ వేశారు. ఎరికల సంఘం ఆధ్వర్యంలో కర్రసాము ప్రదర్శన నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాడిదలు, గొర్రెలకు సోనియాగాంధీ చిత్రపటాలు తగిలించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇటుకలపల్లిలో వాల్మీకులు బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఎస్కేయూలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి సమైక్య నినాదాలు చేశారు. మడకశిరలో సమైక్యవాదులు గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అక్కడికి వెళ్లిన పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని అడ్డుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. రాయదుర్గంలోని అమరజీవి శిబిరంలో దీక్ష చేస్తున్న జాక్టో నాయకులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలంటూ ఉపాధ్యాయులు భజన చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్ యజమానుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు రోడ్డుపైనే వంటా వార్పు, ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో దీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలకు ఎమ్మెల్యే కాపు సంఘీభావం తెలిపారు. అలాగే నాయకులు పొర్లుదండాలతో నిరసన తెలిపారు.  ఇదే పట్టణంలో టీచర్ల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో నిరసనలు పెద్దఎత్తున జరిగాయి.
 
 బత్తలపల్లిలో వాల్మీకులు బంద్ నిర్వహించారు. ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో న్యాయవాదులు రోడ్డుపైనే కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. వ్యాపారులు నడిరోడ్డుపై కూరగాయలు విక్రయించారు. విద్యార్థులు బైక్ ర్యాలీ చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టాటా ఏస్ వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఉపాధ్యాయులు ఖాళీ కుండలతో ప్రదర్శన నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు చేపట్టారు. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. క్రైస్తవులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో పట్టు పరిశ్రమ శాఖ ఉద్యోగుల రిలే దీక్షలు చేపట్టారు. వడ్డెర్లు ర్యాలీ, వంటా వార్పు చేపట్టారు.
 
 న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు, న్యాయవాదుల దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేత ఎల్‌ఎం మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఓడీ చెరువులో సమైక్యవాదులు కోలాటాలు, వంటా వార్పుతో హోరెత్తించారు. బుక్కపట్నం, కొత్తచెరువులో సమైక్యవాదుల రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గేయానంద్ సంఘీభావం ప్రకటించారు. పదవికి రాజీనామా చేయాలని పుట్టపర్తిలో ఎమ్మెల్సీ గేయానంద్‌ను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. పెనుకొండలో జర్నలిస్టులు రక్తదాన శిబిరం నిర్వహించారు.  జేఏసీ నాయకులు వీధులు ఊడ్చి నిరసన తెలిపారు.
 
 అలాగే మంత్రులు ఎక్కడున్నారంటూ జ్యోతిష్కున్ని అడిగారు. గోరంట్లలో సమైక్యవాదులు భారీ ర్యాలీ చేశారు. శింగనమలలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నార్పలలో  తాపీ మేస్త్రీలు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, వంటా వార్పు చేపట్టారు. మున్సిపల్ జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఒంటికాళ్లతో నిరసన తెలిపారు. ఉరవకొండలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు వైఎస్సార్‌సీసీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు తుంగభద్ర జలాలతో తెలుగు తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement