రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో సమైక్యవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆందోళన బాట పడుతున్నారు.
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో సమైక్యవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆందోళన బాట పడుతున్నారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన బాట వీడేది లేదని తేల్చి చెబుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం వరుసగా 73వ రోజు కూడా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగింది. ఉద్యోగులు, విద్యార్థులు, వైద్యులు, కార్మికులు వివిధ ఆందోళనలతో నిరసన తెలియజేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేశారు.
ఒంగోలు నగరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. రిమ్స్ ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించి హాస్పటల్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, సోనియా గాంధీకి పిండప్రదానం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జిల్లాలో ఆగని నిరసనలు..
అద్దంకిలో సమ్మెలో పాల్గొన్న 500 మంది ఆర్టీసీ కార్మికులకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ రూ 10 లక్షల విలువైన బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. చీరాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే టీడీపీ కార్యకర్తలు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలో కూర్చున్నారు. వేటపాలెంలోనూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. గిద్దలూరులో సమైక్యాంధ్ర జేఏసీ దీక్షా శిబిరంలో శుక్రవారం పారామెడికల్ కళాశాల విద్యార్థినులు దీక్షలో కూర్చున్నారు. అంతకు ముందు విద్యార్థినులు ఉద్యోగులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. సీమాంధ్ర ద్రోహుల దిష్టిబొమ్మలను విద్యార్థినులు దహనం చేశారు. కనిగిరిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కాపు బలిజ సంఘానికి చెందిన వారు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రిలే దీక్ష చేపట్టారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పట్టణంలో వీధుల వెంట తిరుగుతూ మిక్చర్, మొక్కజొన్న కండెలు అమ్మి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రిలే దీక్షలో కూర్చున్నారు. మార్కాపురంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు కోర్టు సెంటర్‌లో ఒంటికాలిపై నిలబడ్డారు. ఎన్జీఓ హోం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదులు, బీసీ సంఘాల సభ్యులు ప్రదర్శన నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దదోర్నాలలో జేఏసీ నేతృత్వంలో నారీభేరి నిర్వహించారు.