కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ప్రజా చైతన్యం వెల్లువెత్తుతోంది. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్ష కొనసాగిస్తున్నారు. సోమవారం కర్నూలులోని కృష్ణదేవరాయల సర్కిల్‌లో మాజీ ఎమ్మెల్సీ, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశాయి. వేలాది మందితో కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, చౌక దుకాణాల డీలర్లు, విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా ట్రెజరీ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కర్నూలు రజక సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్‌లో బట్టలు ఉతికి నిరసన తెలిపారు. ఆ తర్వాత రిలే దీక్షలు చేపట్టారు. వివిధ ప్రజా సంఘాలు రాష్ట్ర విభజనను నిరసిస్తూ ర్యాలీలు నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి వేషధారణ ఆకట్టుకుంది. నంద్యాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
డోన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సమైక్యాంధ్రపై గడపగడపకు వెళ్లి ప్రజల్లో చైతాన్యం తీసుకొస్తున్నారు. సీమ గర్జన పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక విద్యార్థి, ప్రజా సంఘాలు 5వేల మందితో ర్యాలీ నిర్వహించారు. కోడుమూరులో జర్నలిస్టులు, సమైక్యాంద్ర నినాదాలతో హోరెత్తించారు. ఆళ్లగడ్డలో ముస్లిం మైనార్టీ నాయకులు, జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని మెయిన్‌బజార్ నుంచి పాతబస్టాండ్ మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. పత్తికొండలో సమైకాంధ్రకు మద్దతుగా జూనియర్ కళాశాల, జిల్లా ఉన్నత పరిషత్ విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లు, కార్మిల్ సోసైటీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీ చేసి ప్రధాన రోడ్డుపై కబడ్డీ ఆడారు. వైఎస్.విజయమ్మ దీక్షకు మద్దతుగా పత్తికొండలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్యయకర్త కోట్ల హరి చక్రపాణి రెడ్డితో పాటు మరో 9 మంది దీక్షలో కూర్చొన్నారు. ఎమ్మిగనూరులో బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పురోహితులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్‌లో హోమంను నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు చేపట్టిన రిలే దీక్షలకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోడలు నిరుపమ పూలమాలలు వేసి మద్దతు పలికారు. ఆత్మకూరులోనూ వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి.
సమైక్య చైతన్యం
Published Tue, Aug 20 2013 12:45 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement