ఉద్యోగులతో ఉద్యమమా..
Published Fri, Aug 30 2013 4:38 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉద్యోగులతో ఉద్యమాలు నడిపిస్తారా అంటూ సీమాంధ్ర నేతలపై టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ మండిపడ్డారు. సంగారెడ్డిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు తమ ఉద్యమాన్ని కేవలం ఉద్యోగుల చుట్టూనే తిప్పుతున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణవాదుల న్యాయమైన డిమాండ్ అన్న ఏపీఎన్జీఓలే ఇపుడు అన్యాయమనడం దారుణంగా ఉందన్నారు. ఏపీఎన్జీఓలు తమ కార్యాచరణపై కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభను రోజుకో సభగా చెబుతున్నారన్నారు.
ఒకసారి భారీ బహిరంగ సభ అనీ, మరోసారి అవగాహన సభ అంటూ మాటలు మారుస్తున్నారన్నారు. ఢిల్లీ కేంద్రంగా మూడు రోజులుగా ఎపీఎన్జీఓ నేతలు అసత్యప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో ఇరు ప్రాంతాలకు లాభం జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగులకు సమస్యలు ఏర్పడతాయన్న సీమాంధ్రుల ఆపోహలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో ఏర్పాటయ్యే కొత్త సచివాలయంలో 200 హెచ్‌ఓడీ పోస్టులతోపాటు అనే ఉద్యోగాలు వస్తాయన్నారు.
విభజనతో ఏర్పడే పింఛన్, జోనల్, సీనియారిటీ సమస్యలను పరిష్కరించుకునేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలి పారు. ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరగటం దేనికి ప్రతీక అని ప్రశ్నించారు. తెలంగాణవాదులపై దాడులు కొనసాగితే తదనంతరం చోటు చేసుకునే పరి ణామాలకు సీమాంధ్రులు బాధ్యత వహిం చాలని హెచ్చరించారు. విభజన అనంతరం జల వివాదాలు తలెత్తవని, కృష్ణా, గోదావరి నదుల్లోని జలాలను కేటాయించిన కోటా మేర కే తెలంగాణ వాడుకుంటుందని స్పష్టం చేశారు.
పోలీసులు సమ్మెలో ఉన్నారా?
సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యోగులను నిర్బంధించటంతోపాటు లాఠీచార్జీలు, అరెస్టులు చేసిన పోలీసులు ఇపుడు సమ్మెలో ఉన్నారా అని దేవీప్రసాద్ ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెతోపాటు అక్కడక్కడా దాడులు చేస్తున్నా పోలీసులు స్పందించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకటించిన తేదీ వరకు సద్భావన ర్యాలీలు కొససాగుతాయన్నారు.
విలేకరుల సమావేశంలో టీఎన్జీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్యాంరావు, టీఎన్జీఓ జిల్లా నాయకులు రాఘవేందర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, సుశీల్‌బాబు, సిద్దు, రవి, జావేద్, శ్రీనివాస్, రేచల్, మంజుల,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement