ఆర్టీసీలో సమ్మె సైరన్
Published Wed, Aug 7 2013 3:28 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులకు బుధవారం మధ్యాహ్నం సమ్మె నోటీసు ఇస్తామని ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వైవీరావు ‘సాక్షి’కి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలతో కూడా సమావేశం నిర్వహించి వారి సహకారం తీసుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట కమిటీని మంగళవారం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా, టీవీ భవాని కోశాధికారిగా వ్యవహరిస్తారని, నాలుగు జోన్‌ల ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారని వివరించారు. 8వ తేదీ నుంచి అన్ని డిపోల్లో నిరహారదీక్షలు, 10న డిపోల ఎదురుగా మానవహారాలు, అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఏన్జీవో జేఏసీలతో కలిసి సమ్మెకు దిగుతామని తెలిపారు. అప్పటినుంచి ఒక్క బస్సు కూడా రోడ్డుపై తిరగనీయబోమని హెచ్చరించారు.
Advertisement