అవనిగడ్డ ఉప పోరు ఎన్నికా? ఏకగ్రీవమా? | Avanigadda Assembly constituency Anonymous | Sakshi
Sakshi News home page

అవనిగడ్డ ఉప పోరు ఎన్నికా? ఏకగ్రీవమా?

Published Wed, Aug 7 2013 3:24 AM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

Avanigadda  Assembly constituency  Anonymous

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ సానుభూతి మంత్రాన్ని జపించిన టీడీపీ ఏకగ్రీవంతో తమ స్థానాన్ని పదిలపర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనబడటం లేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియనుండటంతో ఎన్నికా, ఏకగ్రీవమా అనేది ఉత్కంఠగా మారింది. 
 
 సానుభూతి కోణంలో పోటీకి పార్టీలు దూరం
 అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. 
 
 ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. ఏదేమైనా అవనిగడ్డ ఉప ఎన్నికలను సానుభూతి కోణంలో చూసిన వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టడంలేదని ప్రకటించాయి. దీంతో అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడమే తరువాయి పోటీ లేకుండా ఏకగ్రీవం అవుతారని అందరూ భావించారు. తీరా నామినేషన్ల సమయం వచ్చేసరికి ఆయనతోపాటు మరో 16 మంది వరకు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన దశలో ఐదుగురిని అనర్హులుగా ప్రకటించడం, మంగళవారం ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ నుంచి విరమించుకోవడంతో టీడీపీతో కలిపి మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. 
 
 రాజీ యత్నాలు ముమ్మరం..
 నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో ఏకగ్రీవం కోసం తెలుగుదేశం రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం మాచవరపు ఆదినారాయణ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మిగిలిన 10 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. వారిని ఎలాగోలా ఒప్పించి పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మరికొందరు నేతలు రంగంలోకి దిగారు.
 
 21న ఎన్నికలు..
 నియోజకవర్గంలో మొత్తం 1,87,200 మంది ఓటర్లుండగా వీరిలో 93,307 మంది పురుషులు, 93,893 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయగా ఆయనపై టీడీపీ తరఫున పోటీచేసిన అంబటి బ్రాహ్మణయ్య 417 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. 
 
 ఈ ఎన్నికల్లో పీఆర్‌పీ తరఫున సింహాద్రి రమేష్‌బాబు పోటీలో ఉండటంతో కాంగ్రెస్ ఓట్లకు భారీ స్థాయిలో గండిపడటంతో              టీడీపీ అతి కష్టంమీద గెలిచింది. బ్రాహ్మణయ్య మృతితో ఈ నెల 21న అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement