కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాలు మహోద్ధృతంగా సాగుతున్నాయి. మారుమూల పల్లెల నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. జూలై 31న మొదలైన సమైక్య ఉద్యమం రోజురోజుకూ తీవ్రమై బుధవారానికి 50 రోజుకు చేరింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో గత నెల 13 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. జీతాలు లేకపోయినా ఏమాత్రం వెరువకుండా సమైక్యాంధ్ర కోసం నిరంతరం ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు.
గ్రామస్థాయిలోని వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ కార్యాలయాలు మొదలుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అన్నీ మూతపడ్డాయి. మొదట్లో కొన్ని శాఖలకే పరిమితమైన సమ్మె క్రమంగా అన్నింటికీ విస్తరించింది. జూలై 31 నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లాపరిషత్ పాఠశాలలు, కళాశాలల తలుపులు తెరుచుకోనేలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంత దీర్ఘకాలం సమ్మె చేయడం ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, రవాణా గనుల శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మెలో ఉండటంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గ్రామ పంచాయతీలు సైతం సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసి ప్రధాని, రాష్ట్రపతి తదితరులకు పంపుతున్నాయి. 50 రోజులకు చేరిన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహించేందుకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఈ నెల 30వ తేదీ వరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్ర విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదని, సమైక్యాంధ్ర కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని సమైక్యవాదులు ప్రకటిస్తున్నారు.
50 రోజులుగా ఉద్యమ జ్వాల
Published Wed, Sep 18 2013 1:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement