పాలకొల్లు, న్యూస్‌లైన్: కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు పర్యటన నేపథ్యంలో గురువారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్యవాదులను పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్బంధించారు. కావూరి పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటనకు రావడంతో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైసీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు, జేఏసీ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, ఉద్యోగు జేఏసీ కన్వీనర్ గుడాల హరిబాబు తదితరులతోపాటు మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కావూరిని సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకుంటున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వారందరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. సాయంత్రం వీరందరినీ సొంత పూచీకత్తులపై విడుదల చేశారు.