సాక్షి, అనంతపురం : జిల్లాలో సమైక్య ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పాలుపంచుకుంటున్నారు. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 60 రోజులుగా ఉద్యమ పథంలో కొనసాగుతున్నారు. దీనివల్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. పాలన పూర్తిగా స్తంభించిపోయింది. కార్యాలయాల్లో ఫైళ్లకు బూజు పడుతోంది. ప్రభుత్వ సంక్షే మ కార్యక్రమాలు అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా ఎవరూ కార్యాలయాలకు వెళ్లడం లేదు. సమస్యలు పరిష్కరించండంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు కూడా నెలన్నరగా ఎక్కడా కనిపిం చడం లేదు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జూలై 30న ప్రకటన వెలువడిన తరువాత జిల్లా లో ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. మొదట్లో 12 రోజులపాటు రోజూ గంటో.. అర గంటో తెరచుకున్న కార్యాలయాలు ఆ తర్వాత పూర్తిగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఆగస్టు 12న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. కలెక్టర్, జే సీ, జెడ్పీ సీఈఓ మినహా జిల్లాలోని దాదాపు 80 వేల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో జిల్లా అంతటా పాలన నిలిచిపోయింది. సంక్షేమ పథకాల అమలు పడకేసింది. ప్రజలకు నెల వారీగా అందాల్సిన పింఛన్లు, రేషన్ సరుకులు కూడా ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, మార్కెటింగ్ శాఖల ఆదాయం భారీగా పడిపోయింది. రెవెన్యూ శాఖ నుంచి పైసా అందడం లేదు.
ఇక రైతులకు కూడా ఖరీఫ్ పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. జిల్లాలో 5,400 మంది కౌలు రైతులు ఉండగా.. 10 శాతం మందికి మాత్ర మే ఖరీఫ్ రుణాలందాయి. రెవెన్యూ అధికారులు అందుబాటులో లేనందున సరైన పత్రాలు అందడం లేదని, దీంతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని అనంతపురం, గుత్తి, పెనుకొండ, రాప్తాడు, ఉరవకొండ ప్రాంతాల కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండడంతో ఈసీలు నిలిచిపోయాయి. ఫలితంగా స్థలాలు, భవనాల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో జిల్లాలో దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్టీసీ కార్మికులు 47 రోజులుగా చేస్తున్న సమ్మెతో ఒక్క అనంతపురం రీజియన్‌కే ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల నష్టం వచ్చింది. వారం రోజులుగా మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో పంట ఉత్పత్తులు, ఇతర వాటిపై వచ్చే ఆదాయానికి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా రూ.30 లక్షల వరకు ఆదాయానికి గండిపడినట్లు సమాచారం. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ, అమ్మహస్తం, అభయహస్తం, పావలా వడ్డీ రుణాలు వంటి పథకాలు జిల్లాలో పూర్తిగా పడకేశాయి. రబీకి సంబంధించి విత్తన పప్పుశనగ, వేరుశనగ పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. స్ప్రింక్లర్లు, డ్రిప్పు పరికరాలు అందక సూక్ష్మసేద్యం పడకేసింది. పశుక్రాంతి భ్రాంతిగా మారింది. అటు బ్యాంకుల్లోనూ.. ఇటు ట్రెజరీల్లోనూ ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. మునిసిపల్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ వంటి కీలక శాఖల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు. పాత బిల్లులు ఇస్తేనే.. కొత్త పనులు చేస్తామని కాంటాక్టర్లు తెగేసి చెబుతున్నారు. దీని వల్ల వివిధ అభివృద్ధి పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ చేతగానితనమే కారణమంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన చిచ్చుపెట్టి ఢిల్లీ పెద్దలు తమాషా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్తంభించిన పాలన
Published Sun, Sep 29 2013 3:30 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement