సాక్షి, కాకినాడ :
సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు ప్రభుత్వ శాఖల పై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ తర్వాత రాష్ర్ట ఖజానాకు ఆదాయాన్ని ఆర్జించి పెట్టేది వాణిజ్య పన్నులశాఖ. ఈ శాఖ ద్వారా ఏటా జిల్లా నుంచి సుమారుగా రూ.450 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. సమైక్య ఉద్యమం ఈ శాఖ ఆదాయానికి గండికొట్టింది. వాణిజ్య పన్నుల శాఖకు జిల్లాస్థాయి లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంతో పాటు 11 సర్కిల్స్ ఉన్నాయి. డీసీ కార్యాలయంలో డీసీ పౌసమి బసుతో పాటు సుమారు 50 మంది వరకు గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులతో పాటు క్లాస్-4 ఉద్యోగు లు, ఇతర సిబ్బంది ఉండగా, ప్రతి సర్కిల్ పరిధిలో ఇదే రీతిలో 30 మంది చొప్పున పనిచేస్తున్నారు.
డీసీ మినహా మిగిలిన అధికారులు, సిబ్బంది గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్వజనుల సమ్మెలో భాగస్వాములయ్యారు. దీంతో డీసీ కార్యాలయంతోపాటు జిల్లాలోని 11 సర్కిల్ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. జిల్లా ఆడిట్ విభాగంతో పాటు లార్జ్ ట్యాక్స్ యూనిట్ కూడా మూతపడింది. ఈ యూనిట్ ద్వారా నెలకు రూ.10 కోట్లు, ప్రతీ సర్కిల్ నుంచి నెలకు రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. జిల్లాలో మండపేట, రామచంద్రపురంతో పాటు తుని, కాకినాడ, ఆల్కట్‌గార్డెన్(రాజమండ్రి)సర్కిల్స్ నుంచి అత్యధిక ఆదాయం వస్తుంది. సమైక్య ఉద్యమంలో భాగంగా తొలుత బంద్‌ల కారణంగా తొలి 13 రోజులు కార్యాలయాలు సరిగా పని చేయలేదు. 12వ తేదీ నుంచి సర్వజనుల సమ్మె పుణ్యమాని కార్యాలయాలన్నీ మూతపడడంతో ఆ వచ్చే కొద్దిపాటి ఆదాయానికి సైతం బ్రేకులు పడ్డాయి.
ఈ లెక్కన గత 44 రోజుల సమైక్య ఉద్యమం, గత 31 రోజుల సర్వజనుల సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా ఈశాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ. 50 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఇటీవలే ప్రారంభించిన ఈ-పేమెంట్ ద్వారా ప్రస్తుతం 10 నుంచి 20 శాతం వరకు పన్నులు చెల్లింపులు నేరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఉద్యమం పన్ను చెల్లింపుదారులకు బాగా కలిసి వస్తోంది. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగానో, రోటేషన్ చేసుకునేందుకో వినియోగిస్తున్నారు. ఈ పన్నులను ఇవాళ కాకపోయినా సమ్మె అనంతరమైనా వసూలు చేస్తారు. సమ్మె అనంతరం స్పెషల్ డ్రైవ్‌తో పన్నులను వసూలు చేయడం అధికారులకు నిజంగా కత్తిమీద సామే.
పన్ను వసూలుకు సమ్మె సెగ
Published Mon, Sep 16 2013 2:33 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement