ఉగ్రరూపం దాల్చిన సమైక్యాంధ్ర | united state movement at peaks | Sakshi
Sakshi News home page

ఉగ్రరూపం దాల్చిన సమైక్యాంధ్ర

Published Wed, Aug 7 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

united state movement at peaks

సాక్షి, ఒంగోలు : సమైక్యాంధ్ర ఉద్యమ నాదం జిల్లాలో మార్మోగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులతో పాటు మంగళవారం ఉద్యమ పథంలో కార్మికులు కదం తొక్కారు. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లాను హోరెత్తిస్తున్నారు. ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చురుకైన పాత్ర పోషిస్తూ ముందు వరుసలో నిలిచి దిశా నిర్దేశం చే స్తోంది.  పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో రెండో రోజు మంగళవారం ఒంగోలు నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగర కమిటీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి  దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
 
 ఒంగోలులో  వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ విజయకుమార్ సమావేశాన్ని బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలిపారు. వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం. వెంకయ్య నేతృత్వంలో డాక్టర్లు పద్మావతి, వేణుగోపాలరెడ్డి, తదితరులు చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఎన్‌జీఓ సంఘాలు భోజన విరామ సమయంలో కలెక్టరేట్ బయట ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ నేతృత్వంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. వుడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగమ్మ కాలేజీ జంక్షన్‌లో రాస్తారోకో, మానవహారంతో నిరసన తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర ఉద్యమ పోరాట కమిటీని మంగళవారం ప్రకటించింది. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించుకున్నారు.
 
 చీరాలలో మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు పట్టణమంతా ర్యాలీ నిర్వహించి గడియారస్తంభం సెంటర్లో ధర్నా  చేశారు. పర్చూరులో బార్ అసోసియేషన్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. న్యాయవాదులు చాగంటి సుబ్బారావు, యార్లగడ్డ వెంకటేశ్వర్లు, కె. శ్రీనాథ్‌లు దీక్షలో పాల్గొన్నారు. దర్శిలో న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తించారు. బసిరెడ్డిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతృత్వంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 సంతనూతలపాడులో జేఏసీ ఆధ్వర్యంలో మద్దిపాడు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కందుకూరులో మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాస్తారోకో చేశారు. సీఎస్ పురం మండలంలో విద్యార్థులు నిరసన తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొనగా, న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అద్దంకిలో కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్, నాయీ బ్రాహ్మణ సంఘం, బార్ అసోసియేషన్, ఆటో వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలు ర్యాలీ నిర్వహించి పలు చోట్ల రాస్తారోకోలు చేశాయి. బల్లికురవ మండలంలోని కొప్పెరపాడులో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement