విజయనగరంలో భారీ ర్యాలీ, గర్జించిన లక్ష గళాలు... | United state movement massive rally at vijayanagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో భారీ ర్యాలీ, గర్జించిన లక్ష గళాలు...

Published Sat, Aug 31 2013 4:42 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

United state movement massive rally at vijayanagaram

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యాంధ్రప్రదేశ్‌గా ఉంచాలని డిమాండ్ విజయనగరం పట్టణంలో లక్ష గొంతులు సమైక్య నినాదాన్ని మార్మోగించాయి. రాష్ట్ర విభజన యోచనను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కాంగ్రెస్ హైకమాండ్,  కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వేర్పాటు వాదులు వ్యవహారశైలిని దుయ్యబడుతూ పెద్ద పెట్టున గర్జించాయి. సమైక్యాంధ్ర సమరభేరి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహంచిన లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. ర్యాలీ ఆద్యంతం సమైక్యవాదులంతా శాంతియుతంగా సాగారు. వివిధ ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది ఉదయం 9.30 గంటలకు పట్టణంలోని కోట జంక్షన్ వద్దకు చేరుకున్నారు.
 
 ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ వారి జాతరను తలపిస్తూ లక్ష గళ గర్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమైక్యవాదులతో పట్టణ రహదారులు కిక్కిరిసిపోయాయి. స్థానిక కోట జంక్షన్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీగా మూడు లాంతర్ల జంక్షన్, మెయిన్‌రోడ్డు మీదుగా గంటస్తంభం వద్దకు చేరుకుంది. అక్కడ ఆందోళనకారులు   బైఠాయించారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయం, ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి, వైఎస్‌ఆర్ జంక్షన్,  రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా మయూరి జంక్షన్ వద్దకు చేరుకుని అక్కడ మానహారం నిర్వహించారు. అక్కడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు చేరుకుని ముక్తకంఠంతో ఢిల్లీ పీఠాలు దద్దరిల్లేలా ఐదు నిమిషాల పాటు జై సమైక్యాంధ్ర అంటూ గర్జించారు.
 
 వివిధ రూపాల్లో నిరసనలు..
 రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర సమరభేరి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమంలో నిరసనలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సమైక్యవాదులు వివిధ రూపాల్లో తమ నిరసనలను వినూత్నంగా వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ ముందు భాగంలో పెద్ద సంఖ్యలో త్రివర్ణ బెలూన్లను  ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామితో సహా ఉద్యోగులు, సిబ్బంది చీపుళ్లతో రోడ్లను ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేశారు.  కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులు మెడలో కూరగాయలను దండలుగా వేసుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. వస్త్రవ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో కూడిన ప్రత్యేక వస్త్రాలను ధరించారు.
 
 న్యాయశాఖ సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేయగా... తోపుడు బళ్ల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో  బళ్లను తోసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మకు శ వయాత్ర నిర్వహించారు.  పులివేషాలు, తప్పెట్టుగుళ్లు, కోలాటం, చెక్క భజన కళాకారులతో పాటు పులువురు చిన్నారులు నృత్యరూపకాలు ప్రదర్శిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో 70 బస్సులతో విద్యార్థులు ర్యాలీగా వచ్చారు.  ర్యాలీలో పాల్గొన్న అందరూ ప్లకార్డులు పట్టుకుని, నుదుట జై సమైక్యాంధ్ర అంటూ రాసి ఉన్న రిబ్బన్లు కట్టుకున్నారు. ఈ కా ర్యక్రమంలో  శ్రీవెంకటేశ్వర ఆధ్యాత్మిక భక్త మండలి, కో- ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్, విద్యుత్ శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్, క్రైస్తవ సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, సమైక్య జేఏసీ, బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, ఆటో వర్కర్స్ యూనియన్, ఏపీ ఎన్జీఓస్, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, విజయనగరం సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, వాకర్స్‌క్లబ్‌లు, టూ వీలర్స్ మోటార్స్ రిపేరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 ఇది అంతం కాదు.. ఆరంభం
 రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ  విజయనగరంలో నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమం సమైక్య  ఉద్యమానికి  అంతం కాదని... ఇది ఆరంభానికి సూచికని  సమైక్యాంధ్ర సమరభేరి జేఏసీ చైర్మన్  జి.శ్రీనివాసరావు అన్నారు.  సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు అవసరమైతే ఢిల్లీ పెద్దల పీఠాలను కదిలించాలని పిలుపునిచ్చారు. లక్ష గళ గర్జన నిరసన ర్యాలీ అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నిరంతర శ్రమతో అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరి సొత్తు అని అటువంటి హైదరాబాద్‌ను ఒక్క ప్రాంతానికే కేటాయిస్తే  తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.  రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతలు, కాంగ్రెస్ అధిష్టానం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  కేంద్ర మంత్రి  చిరంజీవి తన కుమారుడు, తమ్ముడు, మేనళ్లుళ్ల సినిమాలను ప్రదర్శించుకుని డబ్బులు సంపాదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలోఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జేఏసీ ప్రతినిధులు మామిడి అప్పలనాయుడు, ప్రభూజీ, కాపుగంటి ప్రకాష్, ఉప్పు ప్రకాష్, కేవీఎన్ తమ్మన్నశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement