‘సమైక్య’ ఆకాంక్ష | Samaikyandhra Bandh Effect In Eluru | Sakshi
Sakshi News home page

‘సమైక్య’ ఆకాంక్ష

Published Mon, Aug 5 2013 5:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Samaikyandhra Bandh Effect In Eluru

సాక్షి, ఏలూరు :  రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదంటూ సమైక్యవాదులు భీష్మించారు. ఐదో రోజైన ఆదివారం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. నాలుగు రోజులపాటు ఏకబిగిన సాగించిన సమ్మెకు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం కొంత సడలింపు ఇచ్చారు. దీంతో అక్కడక్కడా కొన్ని దుకాణాలు తెరుచు కున్నాయి. ఆర్టీసీ బస్సులు నామమాత్రంగా నడిచారుు. జిల్లాలో అనేకచోట్ల సర్వమత ప్రార్థనలు జరిగాయి. సెలవు రోజున కూడా అన్నివర్గాల ప్రజలు సమైక్య నినాదంతో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. ప్రజల నుంచి చీత్కారాలు, ఒత్తిడి ఎదుర్కొంటున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదివారం ఎట్టకేలకు ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు పీసీసీ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక చాగల్లులో బొల్లిపో వీర్రాజు (68) గుండె పోటుతో  మరణించాడు.
 
 తాళ్లపూడి మండలం తాడిపూడిలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి కేబుల్ ఆపరేటర్లు మద్దతు పలి కారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ వినోద చానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. పెట్రోల్ బంకులను ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకూ వాటి యజమానులు మూసివేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలి కారు.  పోలవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉండిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగారుు. కొయ్యలగూడెం ఆర్టీసీ బస్టాండ్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన బస్సులు తెలంగాణ డ్రైవర్‌లకు, కండక్టర్‌లకు సమైక్యవాదులు ఫ్రెండ్ షిప్ బ్యాండ్‌లు కట్టి నిరసనలు తెలిపారు.
 
 ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేలా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మనసును మార్చాలని ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని ముస్లింలంతా ప్రదర్శన నిర్వహించి నమాజు చేశారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. జూట్ మిల్లువద్ద వేకువజామునే బస్సులను నిలిపివేశారు. రాష్ట్రాన్ని విడదీస్తే జరిగే నష్టాలు తాగుబోతు కేసీఆర్‌కు తెలియూలని పేర్కొంటూ  నెహ్రూ నగర్‌లో యువకులు ఒక వ్యక్తికి కేసీఆర్ వేషం వేసి ఊరేగించారు. ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గాయత్రి పురోహిత సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. కాపునాడు ఆధ్వర్యంలో వైఎంహెచ్‌ఏ హాలు ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
 
 జిల్లా అండర్-14, అండర్-16 క్రీడాకారులు సీఆర్‌రెడ్డి గ్రౌండ్ చుట్టూ ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకునే వారు ఈ వారం వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసివేసి ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఆటో ఓనర్లు, డ్రైవర్లు ర్యాలీ చేశారు. దెందులూరు మండలం మొండూరు గ్రామానికి చెందిన 200మంది రైతులు మోటార్ సైకిళ్లపై ఏలూరు వచ్చి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విషయంలో కేంద్ర మంత్రులను కుక్కలుగా చిత్రీకరించి, ఒక్కొక్కరి వ్యక్త్తిత్వాన్ని వివరిస్తూ  కరపత్రాలు పంపిణీ చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో కేసీఆర్  దిష్టి బొమ్మలను దహనం చేశారు. బాదంపూడిలో రైల్‌రోకో చేశారు. పాలకొల్లు పట్టణంలో రిలే నిరహార దీక్షలు కొనసాగాయి. బ్రాడీపేట, అన్నపూర్ణ థియేటర్ సెంటర్లలో సోనియా, కే సీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దొడ్డిపట్లలో వంటావార్పు నిర్వహించారు. పోడూరు మండలం బొల్లేటికుంట చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెనుగొండలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒక రోజు రిలే దీక్ష చేశారు. ఆచంటలో జేఏసీ ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. జంగారెడ్డిగూడెంలో ప్రాంతీయ బ్రాహ్మణ పురోహిత అర్చక సేవా సమాఖ్య ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటర్‌లో లక్ష్మీగణపతి శాంతి హోమం నిర్వహించారు. హైస్కూల్ సెంటర్‌లో విద్యార్థులు, యువకులు ప్రదర్శన నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోటారు వర్కర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు.
 
 నిడదవోలులో ట్రక్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో 150 ట్రక్కు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను వాహనంపై ఉంచి శవయాత్ర నిర్వహించి తగులబెట్టారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో మానవహారం నిర్వహించి సర్వమత ప్రార్థనలు చేపట్టారు. ఉపాధ్యాయులు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు తేతలి జాతీయ రహదారి జంక్షన్ వద్ద వంటావార్పు చేసి నిరస వ్యక్తం చేశారు. దెందులూరు మండలం శ్రీరామవరంలో గంగానమ్మ ఆలయంలో మహిళలు 1008 ఎనిమిది బిందెల నీళ్లతో అభిషేకం చేశారు. దెందులూరు మన్నా చర్చిలో ప్రార్థనలు చేశారు. కొవ్వూరు విజయవిహార్ సెంటర్‌లో మౌనప్రదర్శన జరిగింది. రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. శ్రీరామా కాలనీ వద్ద రాష్ట్ర రహదారిపై సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement