యూపీఏపై జేపీ నిప్పులు
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇక ఒక్కరోజు కూడా కేంద్రంలో కొనసాగే అర్హత కోల్పోయిందని లోక్‌సత్తా పార్టీ వ్యవ స్థాపకుడు జయప్రకాష్ నారాయణ యూపీఏపై నిప్పులు చెరిగారు. ఈ ఓటమిని యూపీఏ ఓటమిగా కాంగ్రెస్ గుర్తించాలన్నారు. ఈ ఫలితాలను సంకేతంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ప్రధాని మన్మోహన్ తన పదవికి రాజీనామా చేసి 3 నెలల ముందే ఎన్నికలను కోరాలన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆదివారం జేపీ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కేంద్రం బలవంతంగా పూనుకోవడాన్నే తాను వ్యతిరేకిస్తున్నానని జేపీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అందులో 4 జిల్లాలను వేరుచేసి మరో రాష్ట్రం ఇస్తామంటే అక్కడి వారు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాయల తెలంగాణను టీ నేతలు ఎందుకు ఒప్పుకోవట్లేదన్నారు.
అవినీతిపై ప్రజల తిరుగుబాటిది: నారాయణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలపై ప్రజా తిరుగుబాటు ఫలితమే ఆ పార్టీ ఓటమని సీపీఐ నేత నారాయణ అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే బీజేపీని గెలిపించారని వ్యాఖ్యానించారు.