![Jayaprakash Narayana Appeal to the Public - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/22/JP2.jpg.webp?itok=Bi6pgKtB)
తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఊకదంపుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాయని, వీటిని ప్రజలు ఆమోదించకుండా...స్పష్టమైన ఎజెండాతో ఆయా పార్టీ నేతల నుంచి హామీ తీసుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలకు భద్రత, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఆదాయం పెంపునకు మార్గాలు చూపే పార్టీలకే ఓటేస్తామని చెప్పాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు డిమాండ్ చేయాల్సిన ఆరు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వాటిలో పౌరసేవల చట్టం ఒకటిగా పేర్కొన్నారు. దీన్ని ప్రజల హక్కుగా డిమాండ్ చేయాలన్నారు. ఇక విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని, ప్రతి కుటుంబానికీ ఉచిత వైద్య వసతి కల్పించాలన్నారు. మహిళల భద్రతకు స్థానికంగానే కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రుణమాఫీ వంటి పథకాలను కాకుండా రైతులకు వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం వచ్చేలా చూడాలని జేపీ సూచించారు. గిట్టుబాట ధర కల్పించడం, తక్కువ వడ్డీతో రుణాలివ్వడం, దళారులు లేని మార్కెట్ వ్యవస్థ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఇక పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుంచే తలసరి కేటాయింపులు జరపాలని ఆయన సూచించారు. ఈ అంశాలపైనే ప్రజలు నేతల నుంచి హామీలు పొందాలని జయప్రకాశ్ నారాయణ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment