సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా ఒక్క కొత్త విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు కూడా నీళ్లొదిలింది. ప్రకాశం జిల్లా వాడరేవు సమీపంలో రూ.20 వేల కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు(యూఎంపీపీ) నిర్మించరాదని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహు కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు.
గతంలో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కాలపరిమితి తీరిపోవడంతో పాటు భూసేకరణ కష్టంగా మారడమూ ఇందుకు కారణమని తెలుస్తోంది. ఫలితంగా రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేసిన 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. మరోవైపు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన విద్యుత్ యజ్ఞానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆయన హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించిన వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలోని 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్లాంటుతోపాటు వైఎస్సార్ జిల్లా ముద్దనూరు వద్ద ప్రారంభించిన 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనులూ సాగడం లేదు.
బొగ్గు బ్లాకులను మళ్లించారు
వాస్తవానికి వాడరేవు యూఎంపీపీకి బొగ్గు మంత్రిత్వశాఖ తాజాగా బొగ్గు బ్లాకులను కూడా కేటాయించింది. ఒడిశా తాల్చేరు బొగ్గు గనిలోని సర్పాల్-నౌపర్హా బ్లాకును కేటాయించింది. ఈ బొగ్గు బ్లాకుల్లో ఏకంగా 701.16 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని అంచనా. వాడరేవు యూఎంపీపీని చేపట్టకపోవడంతో ఈ బ్లాకుల నుంచి వెలికితీసే బొగ్గును విజయవాడ, కొత్తగూడెంలలో నిర్మించే చెరో 800 మెగావాట్లతో పాటు సత్తుపల్లిలో నిర్మించే 600 మెగావాట్ల ప్లాంటుకు మళ్లించాలని బొగ్గు మంత్రిత్వశాఖకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
వాడరేవు థర్మల్ ప్లాంట్ నిలిపివేత
Published Thu, Dec 19 2013 6:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement